కరీంనగర్ : ‘పాదయాత్రల పేరిట వస్తున్న పార్టీల నాయకుల మాయమాటలకు మోసపోతే మళ్లీ గోస పడతాం. వారితో జాగ్రత్తగా ఉండాల’ ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. ఒక్కసారి తప్పు జరిగితే పిల్లల భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందని అలాంటి అవకాశం ఇవ్వవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.
శాసన మండలి చీఫ్ విప్ గా ఎన్నికైన తానిపర్తి భానుప్రసాద్ రావు మొదటి సారి పెద్దపల్లి జిల్లాకు వచ్చిన సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఆంధ్రోళ్ల కళ్లు మళ్లీ తెలంగాణ పై పడ్డాయని ఆరోపించారు. తెలంగాణ(Telangana) ను మరోసారి దోచుకునేందుకు పాదయాత్ర ల పేరిట గ్రామాలకు వస్తున్నారని వెల్లడించారు.
స్వయంపాలనలో ముఖ్యమంత్రి కేసీఆఆర్ ముందు చూపుతో 24 గంటల కరెంటుతో భూమికి భరువయ్యే పంట పండుతోందని అన్నారు. ఆనాడు ఆంధ్ర పాలకుల వల్ల పంటలకు నీరు వచ్చేది కాదని అన్నారు. నీళ్లు ఉంటే కరెంట్ ఉండదు. పండిన పంట కొనే పరిస్థితిలో ఉండేది కాదని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచి సత్తా చాటుతామని అన్నారు. నిరంతరం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పరితపించే కేసిఆర్ కు అండగా ఉండాలని కోరారు . సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్దపెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత,ఎమ్మేల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కొరుకంటి చందర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.