Minister Gangula | ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణలోని మహిళలకు ఉచితంగా సమగ్ర వైద్యారోగ్య పరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పట్టణంలో ఆరోగ్య మహిళా పథకాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు లాంఛనంగా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కరీంనగర్ రెస్ట్ హౌస్, జిల్లా కలెక్టర్‌తో పాటు వైద్యాధికారులతో పర్యటన ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ మహిళలు వ్యాధుల బారిన పడకుండా వారికి ముందస్తుగా తగిన చికిత్స అందించేందుకు ప్రభుత్వం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా కరీంనగర్ పట్టణంలోని బుట్టి రాజారాంకాలనీలో ఉన్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మార్చి 8న రాష్ట్ర ఆర్థిక వైద్యాఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోగ్య మహిళా కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు.
మంత్రి హరీశ్‌రావు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో, ఎంసీహెచ్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని, చైతన్య డిగ్రీ కళాశాల, శివాని కళాశాలలోని విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు, మెడికల్ కళాశాల కొత్తపల్లి సందర్శిస్తారని, బస్తీ దవాఖానను మంత్రి సందర్శిస్తారన్నారు. ఈ పథకంలో మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్, మైక్రో న్యూట్రీఎంట్ల లోపం, యుటిప్ ట్రాక్ అండ్ పెల్సిక్ వ్యాధులు, మోనోపాజ్ సమస్యలు, పీసీఓడీ, బహిష్టు సమస్యలు, కుటుంబ నియంత్రణ, బీపీ, షుగర్, సంతానోత్పత్తి సమస్యలు, సుఖ వ్యాధులు, బరువు, ఊబకాయ సమస్యలు తదితర 57 టెస్టులు ఇందులో ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, నగర మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి – హరి శంకర్, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, జీవీ శ్యామ్‌ప్రసాద్ లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జవేరియా, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ రత్నమాల, ఆర్అండ్బీ ఈఈ సాంబశివరావు, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.