తొర్రూరు : ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ విజన్ కారణంగా పల్లెలు, మున్సిపల్ పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli Dayakar Rao) అన్నారు. తెలంగాణ అవతరణ వేడుకల్లో(Decade Celebrations) భాగంగా పట్టణ ప్రగతి ఉత్సవాలను శుక్రవారం తొర్రూరు పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్ స్టాండ్ నుంచి పట్టణ మున్సిపాలిటీ ట్రాక్టర్ను మంత్రి నడిపారు.
మంత్రి మాట్లాడుతూ తొర్రూరు మున్సిపాలిటీ సమున్నత అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నానని పేర్కొన్నారు. రూ. 120 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. రాష్ట్రంలోనే అత్యంత వేగంగా పట్టణం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.
పట్టణంలో సెంట్రల్ లైటింగ్(Central Lighting), మొక్కల పెంపకం, సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, కొత్త రోడ్లు, మోడల్ ఇంటిగ్రేటెడ్, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, కోల్డ్ స్టోరేజ్, యతిరాజారావు పార్క్, పిల్లల పార్క్(Children Park) ను ఏర్పాటు చేశామని వివరించారు. మహిళలు చిన్న పరిశ్రమలు ఏర్పాటకు వడ్డీలేని రుణాలు, బ్యాంక్ లింకేజీ రుణాలు అందజేస్తున్నామని అన్నారు.
తెలంగాణ ఏర్పడక ముందు , తరువాత జరిగిన అభివృద్ధిని విశ్లేషించుకోవాలని కోరారు. మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో 110 వ స్థానం నుంచి 31వ స్థానానికి చేరుకుందన్నారు. పట్టణ ప్రగతి ఉత్సవాల సందర్భంగా కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. అధికారులు, సఫాయి కార్మికులు, సిబ్బందిని మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.