వరంగల్, సెప్టెంబర్ 6 : దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన 60 ఏండ్ల కాంగ్రెస్, పదేండ్ల బీజేపీ పాలన వల్లే మనకీ కష్టాలు దాపురించాయి. ఆ పాపాలను కడుక్కోవడానికే సరిపోతున్నది. కేవలం పదేండ్లలోనే కేసీఆర్ సీఎం అయ్యాకే, తెలంగాణ సస్యశ్యామలమైందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పరకాల నియోజకవర్గంలో రూ.27 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీకి విజన్ లేదు. ఆ పార్టీ నేతలకు బుద్ధి లేదు, రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. బీజేనీ బోగస్ పార్టీగా గుర్తించారు. ఆ పార్టీకి మన రాష్ట్రంలో నూకల్లేవని స్పష్టం చేశారు. ప్రజలు బీఆర్ఎస్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మీకుఅండగా మేమంతా నిలుస్తాం అని అన్నారు.
గతంలో గ్రామాలు ఎట్లుండే, గ్రామాల్లో కరెంటు, నీళ్లు, రోడ్లు, మౌలిక సదుపాయాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో గుర్తు చేసుకోవాలని మంత్రి తెలిపారు. అందుకే సీఎం కేసీఆర్కు మనమంతా అండగా ఉండాలని, ఆయనకు అన్యాయం చేస్తే, కన్నతల్లికి అన్యాయం చేసినట్లేనని మంత్రి పేర్కొన్నారు.
పరకాల నియోజకవర్గానికి మంచి ఎమ్మెల్యే దొరికారని, అభివృద్ధి కాముకుడైన చల్లా ధర్మారెడ్డి వల్లే పరకాల గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి సాధించిందని మంత్రి తెలిపారు. ఆయనకు అండగా నిలవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావిణ్య, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.