వరంగల్ : పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెల రూపురేఖలు మారుతున్నాయి. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి ఏడేండ్ల సీఎం కేసీఆర్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమైందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని పర్వతగిరి మండల కేంద్రంలో శుక్రవారం పల్లెప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే అరూరి రమేష్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు.
పర్వతగిరిలో రూ.10 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనం, రైతు వేదిక, అంతర్గత సీసీ రోడ్లనుమంత్రి ప్రారంభించారు.పర్వతగిరి గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులకు రూ.12 కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. మన ఊరు- మన బడితో సర్కారు బడులను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు.
రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల కరెంట్‌తో వ్యవసాయం పండగలా మారిందన్నారు. మరికొద్ది రోజులోనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ గోపి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారలు పాల్గొన్నారు.