హైదరాబాద్ : పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశా.. రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపా ఇంకో అవకాశం ఇస్తే, మీ సేవకుడి లా పని చేసి ప్రజల రుణం తీర్చుకుంటా అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ ఈ రోజు విడుదల చేసిన BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ లో తనకు అవకాశం కల్పించినందుకు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పాలకుర్తి ప్రజలు మంచివారిని, తమకు మంచి చేసే వారిని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుని గుండెల్లో నిలుపుకుంటారని అన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, వివిధ గ్రామాలకు లింకు రోడ్లు వేయించి, బురుగు నీటి కాలువలు వేసి, కడిగిన ముత్యంలా చేశానని తెలిపారు.
అలాగే పాలకుర్తి, బమ్మెర, వల్మిడి సాహిత్య, చరిత్ర ప్రాశస్త్యం అందరికీ తెలిసేలా టూరిజం కారిడార్ ను అభివృద్ది చేశామని పేర్కొన్నారు. చరిత్ర కలిగిన దేవాలయాలకు పునర్ వైభవం తీసుకోచ్చాం. కరోనా సమయంలో అలాగే ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్నామని మరోసారి తనని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.