వరంగల్ : రాజకీయ వేత్తగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేక సేవలు అందించారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వరంగల్లోని ఆకుతోట కన్వెన్షన్ హాల్ ఉర్సు గుట్ట హంటర్ రోడ్ నందు ఏర్పాటుచేసిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు.
అనంతరం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి, అవార్డులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మన ఊరు- మనబడి పథకం ద్వారా అన్ని పాఠశాలలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో పాటుపడుతుందని చెప్పారు.
ఉపాధ్యాయులు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాలన్నారు. ఉపాధ్యాయుల చేతిలోనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారిపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావిణ్య, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కార్పొరేటర్లు, జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.