యాదగిరి గుట్ట, ఆగస్టు 22 : ఎవరేమి చేసినా, ప్రతిపక్షాలు తలకిందులుగా పొర్లుదండాలు పెట్టినా, రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం అయ్యేది కేసీఆరేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. మంగళవారం మంత్రి తమ ఇలవేల్పు యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి వారిని దర్శించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజలు సుఖ శాంతులతో ప్రశాంతంగా జీవించాలంటే, కేసీఆర్ సీఎం కావాల్సిందేనని ఆయన అన్నారు. ఆ భగవంతుడి చల్లని చూపు ప్రజలై ఉండాలని తాను కోరుకున్నట్లు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన అందిస్తున్నారని, ఇలాంటి సీఎంలు గతంలో ఎవరు లేరన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆదరించాలన్నారు. అరవై ఏండ్లలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని ఈ తొమ్మిది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపిందన్నారు.