వరంగల్ : దేశానికి కావల్సింది గుజరాత్ మోడల్ కాదని, తెలంగాణ మోడల్ కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. అతి తక్కువ కాలంలోనే తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లో ముందుండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా(Warangal) పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలంలో రెండు చోట్ల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS)కు తిరుగులేదు. ప్రతిపక్షాలకు జనాదరణ లేదు. బి అర్ ఎస్ గెలుపునకు ఎదురు లేద’ ని అన్నారు. ఇక ఇప్పుడు కావల్సింది దేశానికి సీఎం కేసీఆర్(CM KCR) మార్గదర్శనమని వెల్లడించారు. దేశం మొత్తం కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నదని అన్నారు. ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరచాలని, కేంద్రం, రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనే ఉండాలని అప్పుడే రాష్ట్రం, దేశం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
అభివృద్ధి నిరోధకులకు అడ్డుకట్ట వేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అభివృద్ధి, సంక్షేమాలపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) లాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పేలా ప్రజలను సమాయత్తం చేయాలన్నారు.
సమైక్య పాలనలో నిరాదరణకు గురైన పల్లెలు నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) ద్వారా సమృద్ధిగా సాగునీరు, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయని తెలిపారు.