మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపు
జనగామలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, ఎమ్మెల్సీలు
జనగామ, ఫిబ్రవరి 6 : జనగామ జిల్లాలో ఈ నెల 11న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మరో మంత్రి సత్యవతిరాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలిసి బహిరంగ సభాస్థలాన్ని పరిశీలించారు. హనుమకొండ హైవేలో జనగామ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం వద్ద సీఎం బహిరంగసభ వేదిక ఏర్పాట్లపై ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. జనగామ కలెక్టరేట్లోని నూతన సముదాయంలోని అన్ని ప్రభుత్వ విభాగాలను, అనంతరం పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. అక్కడే నిర్వహించే బహిరంగసభలో మాట్లాడుతారని చెప్పారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు వారు పేర్కొన్నారు. సభకు పెద్దఎత్తున జనసమీకరణ చేయాలని, అందుకోసం పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని వారు కోరారు.