రఘునాథపాలెం, మార్చి 16: ఖమ్మం భూదాన్ భూముల్లో సర్వస్వం కోల్పోయిన తమకు కూడా అక్కడే ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకోండి సార్’ అంటూ వెలుగుమట్ల బాధితులు అధికారులను వేడుకున్నారు. వెలుగుమట్లలో ఇళ్లు కూల్చేసిన వారిలో కొద్దిమందికే ఇటీవల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారని, అర్హులమైన తమకు పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు చాలా మంది బాధితులు సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. తమ వద్ద ఉన్న అర్హత పత్రాలను కలెక్టర్‌కు చూపించి తమకు న్యాయం చేయాలని కోరేందుకు వచ్చారు.
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకొని ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న పేదలపైకి గత నెల 24న కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లను పంపిన విషయం విదితమే. కనికరం కూడా లేకుండా పేదల ఇళ్లను కూల్చివేయడంతో వారంతా నిరాశ్రయులయ్యారు. దీంతో వారందరినీ ఖమ్మంలోని టీటీడీసీ, అంబేద్కర్ భవన్లలోని పునరావాస కేంద్రాలకు ప్రభుత్వం తరలించింది. కనీస అవసరాలకు, ఆకలిదప్పులకు అక్కడ వారు అలమటించిపోయారు. ఇంతలో వారికి మద్దతుగా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది.
మిగతా పార్టీలు, సంఘాలు కూడా స్వరం కలిపాయి. దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 750 మంది నిర్వాసితుల్లో 311 మందికి మాత్రమే అదే భూదాన్ భూముల్లో ఒక్కొక్కరికీ 75 గజాల చొప్పున ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. అనర్హుల పేరిట మిగతా పేదలను నిరాశ్రయులను చేసింది. ఆ తర్వాత పునరావాస కేంద్రాల నుంచి కూడా వెళ్లగొట్టింది. దీంతో వారంతా సోమవారం నాడు కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు అధిక సంఖ్యలో వచ్చారు. వీరిని గమనించిన పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఆందోళనకూ సిద్ధమయ్యారు.
దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ వస్తారని, న్యాయం చేస్తారనే ఆశతో గంటలకొద్దీ నిరీక్షించారు. కలెక్టర్ రాకపోవడం; కలెక్టరేట్లో లోపల, బయట బాధితులు అధిక సంఖ్యలో ఉండడం వంటి కారణాలతో కలెక్టరేట్ ప్రాంగణంలో అధికారులు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. కంటితుడుపు చర్యగా బాధితుల నుంచి పత్రాలు సేకరించారు. తర్వాత డీఆర్వో బయటకు వచ్చి బాధితులతో మాట్లాడారు. విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేస్తామని చెప్పారు. దీంతో బాధితులు నిరాశతో వెనుదిరిగారు. పట్టాలిచ్చి, ఇందిరమ్మ ఇళ్లు కట్టించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.