అశ్వారావుపేట, మార్చి 16 : ఉపాధిహామీ పథకం కూలీలకు ‘వేసవిభత్యం’ చెల్లింపులు గత మూడేళ్లుగా నిలిచిపోయాయి. తాగునీటి అలవెన్స్‌లు సైతం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. వేసవికాలం మండుటెండలో పనిచేసే కూలీలకు కనీస సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యతను సైతం అధికారులు విస్మరిస్తున్నారు. పనిప్రదేశాల్లో చలువ పందిళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి.
కూలీలు గాయపడితే ప్రథమ చికిత్సకు కిట్లు ఇవ్వాలి.. ఒకవేళ అస్వస్థతకు గురైతే ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించాలి. ఈ నిబంధనలన్నీ కూలీలకు ఉపయోగకరమైనప్పటికీ క్షేత్రస్థాయిలో పూర్తిగా ఇవి అమలుకు నోచుకోవడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లోని 471 గ్రామ పంచాయతీల్లో 1.31 లక్షల జాబ్‌కార్డులు ఉండగా.. 2.18 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. ఏడాదికి రూ.4.58 కోట్లు అందుకోవాల్సిన కూలీలు గత మూడేళ్లలో వేసవిభత్యం కింద రూ.13.74 కోట్లు నష్టపోయారు.
కూలీల వలసలను నిరోధించి స్థానికంగా పనులు కల్పించే గొప్ప లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఇప్పటికే పథకం పేరును వీబీ జీ-రాంజీగా మార్చిన విషయం విదితమే. కూలీలకు మౌలిక సదుపాయాలు సైతం కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. వేసవిలో పనులు కష్టంగా ఉండటంతో కూలీలను ప్రోత్సహించేందుకు అదనంగా ‘వేసవిభత్యం’ అందించాల్సిన నిబంధన ఉంది..
కానీ, గత మూడేళ్లుగా ప్రభుత్వం ఈ ప్రోత్సాహాన్ని చెల్లించకుండా నిలిపివేసింది. తాగునీటి కోసం ఇచ్చే నగదు చెల్లింపు కూడా ఇవ్వడం లేదు. దీంతో ఉపాధి కూలీలు ఆర్థికంగా నష్టపోతున్నారు. పథకం ఉంటుందా.. కేంద్ర ప్రభుత్వం ఎత్తివేస్తుందా.. అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దశలవారీగా పథకం ప్రాధాన్యతను ప్రభుత్వం తగ్గిస్తూ వస్తుండడంతో కూలీలను ఆందోళనకు గురిచేస్తున్నది.
ఉపాధిహామీ కూలీలు వేసవిభత్యం కింద గడిచిన మూడేళ్లుగా రూ.13.74 కోట్లు నష్టపోయారు. జిల్లావ్యాప్తంగా 2.18 లక్షల మంది కూలీలు ఉపాధిహామీ పనులకు హాజరవుతూ జీవనం సాగిస్తున్నారు. వేసవిభత్యం కింద ఫిబ్రవరి నెలలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మే నెలల్లో 30 శాతం చొప్పున అదనంగా కూలీలు పొందుతారు. గత ఏడాది జిల్లాలో ఉపాధిహామీ కూలీలకు ఈ పథకం కింద ప్రభుత్వం రూ.51.54 కోట్లు చెల్లించింది.
ఈ లెక్కన వేసవిభత్యం కింద ఫిబ్రవరిలో రూ.87 లక్షలు, మార్చిలో రూ.1.09 కోట్లు, ఏప్రిల్‌లో రూ.1.31 కోట్లు, మేలో రూ.1.31 కోట్లు మొత్తం ఏడాదిలో రూ.4.58 కోట్ల చొప్పన మూడేళ్లలో రూ.13.74 కోట్లు ఎగనామం పెట్టింది. దీంతోపాటు తాగునీటి కోసం ప్రతి కూలీకి రోజుకు రూ.5 చొప్పున ప్రోత్సాహం కూడా అందడం లేదు. మూడేళ్లలో 2.18 లక్షల మంది ఏడాదికి కనీసం 60 రోజులు పనిచేస్తే రూ.6.54 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
ఉపాధిహామీ కూలీలు కనీస మౌలిక సదుపాయాలకు సైతం దూరమవుతున్నారు. పథకం ప్రచార ఆర్భాటానికి క్షేత్రస్థాయిలో అమలుకు పూర్తి భిన్నంగా ఉంటోంది. వసతులు అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేదంటూ తప్పించుకుంటున్నారు. వేసవిలో వడదెబ్బకు గురై కూలీలు మృతిచెందిన వారు ఉన్నారు. నీడ సౌకర్యం లేదు.. చలువ పందిళ్లు లేవు.. తాగునీటి సౌకర్యం కూడా లేదు. పని ప్రదేశాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు సైతం అందుబాటులో ఉండటం లేదు. క్షేత్రస్థాయిలో నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు.
స్థానికంగానే కూలీలకు పనులు కల్పించే ఉద్దేశంతో అమలు చేస్తున్న ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతోంది. ఇప్పటికే మౌలిక సదుపాయాలను కుదిస్తూ నిధుల వాటాను రూ.30 శాతం తగ్గించింది. కూలీలకు ఇచ్చే వేసవిభత్యం, తాగునీటి అలవెన్స్‌లు ఇవ్వటం లేదు. పైగా పథకం పేరు కూడా మార్చేసింది. భవిష్యత్‌లో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టేందుకు కార్యచరణ రూపొందిస్తున్నాం.
– గోకినపల్లి ప్రభాకర్, జిల్లా కార్యదర్శి, వ్యవసాయ కార్మిక సంఘం, అశ్వారావుపేట
ఉపాధిహామీ కూలీలకు గత మూడేళ్లుగా వేసవిభత్యంతోపాటు తాగునీటి అలవెన్స్ చెల్లింపులు నిలిచిపోయాయి. పథకం మార్గదర్శకాల్లో స్పష్టత లేదు. కూలీల వలసలు లేకుండా స్థానికంగా పనులు గుర్తించి చేయిస్తున్నాం. పని ప్రదేశాల్లో ఉపాధి పనులకు హాజరయ్యే కూలీలకు ఇతర కనీస వసతులు కల్పిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనం అందించేలా పనులను కేటాయిస్తున్నాం. సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార చర్యలు తీసుకుంటున్నాం.
– రామచంద్రరావు, ఈజీఎస్ ఏపీవో, అశ్వారావుపేట
వేసవికాలంలో చేసే పనులకు ప్రభుత్వం చెల్లించే ప్రత్యేక భత్యం మూడేళ్లుగా ఇవ్వడం లేదు. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నాం. వేసవికాలంలో పనులు చాలా కష్టంగా ఉంటాయి. పనులు అస్సలు సాగవు. అందుకే తక్కువ పనిచేసినా కనీస భత్యం అందించాలి. వేసవి కాలం నాలుగు నెలలు అదనపు భత్యం అందడం లేదు. ప్రభుత్వం వేసవిభత్యం చెల్లిస్తేనే కనీస కూలి గిట్టుబాటు అవుతుంది.
– ఎం.రమేశ్, ఉపాధిహామీ కూలీ, అశ్వారావుపేట
ఉపాధిహామీ పనుల వద్ద కనీస సదుపాయాలు ఉండడం లేదు. ముఖ్యంగా వేసవిలో పని జరిగే ప్రదేశాల్లో నీడ, తాగునీటి సౌకర్యాలతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉండడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే అంతే సంగతులు. అధికారులు దృష్టి సారించి కనీస సదుపాయాలు కచ్చితంగా కల్పించాలి. తాగునీరు కూడా ఇంటి నుంచే తెచ్చుకుంటున్నాం. మూడేళ్ల క్రితం వరకు ఒక్కొక్కరికి ప్రభుత్వం రోజుకు రూ.5 ఇచ్చేది. ఇప్పుడు ఇవ్వడం లేదు.
– కుప్పాల రమణ, ఉపాధిహామీ కూలీ, చండ్రుగొండ