హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): సమీప భవిష్యత్తులో వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్లో దాదాపు 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నదని, ఇందులో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న రెండువేల మందికి తక్షణమే జీవనోపాధి లభిస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈ రెండు వేలమందికి దశలవారీగా ఈ ఏడాది అక్టోబర్‌లోగా ఉపాధి కల్పించేందుకు ఆయా కంపెనీలు ముందుకొచ్చాయని చెప్పారు.
గురువారం ఆయన సచివాలయంలో అధికారులు, టెక్స్టైల్ పార్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. వరంగల్ మెగా టెక్స్టైల్ పార్లో ఇప్పటికే పలు కంపెనీలు ఉత్పత్తులు ప్రారంభించాయని చెప్పారు. టెక్స్టైల్ రంగంలో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగావకాశాలు మెండుగా ఉండటంతో పాలకుర్తి నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా వెయ్యి మందికి శిక్షణ ఇచ్చామని, మరో 2 వేల మందికి సెప్టెంబర్ నాటికి శిక్షణ పూర్తవుతుందని తెలిపారు. గురుకులాలు, హాస్టల్ విద్యార్థుల యూనిఫామ్స్ తయారీ ఆర్డర్లను కట్టుశిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు అప్పగించాలని కోరుతూ ఆయా శాఖలకు లేఖలు రాస్తామని వెల్లడించారు.
మహిళా సాధికారతే లక్ష్యంగా స్త్రీనిధి సంస్థ ద్వారా ప్రభుత్వపరంగా పాలకుర్తి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఇకనుంచి సీఎస్సార్ (కంపెనీ సోషల్ రెస్పాన్స్‌బులిటీ) కింద ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగిస్తామని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. ఇప్పటికే 10 వేల మందికి శిక్షణ ప్రారంభించామని తెలిపారు. కుట్టుశిక్షణతోపాటు కుట్టుమిషన్లు కూడా ట్రస్టు ద్వారా అందజేస్తామని, ఇందుకు ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్‌రావు కూడా అంగీకరించారని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మంత్రి కేటీఆర్ సహకారంతో పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్కు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. పార్క్ నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు, భూ సేకరణ పూర్తయినట్టు పేర్కొన్నారు. వెంటనే పనులు ప్రారంభించి వచ్చే సెప్టెంబర్ నాటికి మొదటిదశ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపికచేసిన కార్మికులకు సాధ్యమైనంత తకువ ధరకు అందులో స్థలాలను కేటాయించి, ఉపాధి అవకాశాలను మెరుగు పరచాలని నిర్ణయించామని తెలిపారు. సమావేశంలో టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ మిహిద్, టెక్స్టైల్స్ అడిషనల్ డైరెక్టర్ వెంకటేశం, వరంగల్‌లోని కిటెక్స్ కంపెనీ ప్రతినిధి మనోజ్‌కుమార్, యంగ్వన్ కంపెనీ ప్రతినిధి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.