వరంగల్: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఒకప్పుడు హోంగార్డు జీతాలు కూడా తక్కువగా ఉండేవని వారి జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎటువంటి కేసులైనా త్వరగా పరిష్కరించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని చెప్పారు. వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా మట్లాడుతూ.. గతంలో పోలీస్ స్టేషన్లలో వసతులు కూడా ఉండేవి కాదన్నారు. అయితే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రతి పోలీస్ స్టేషన్‌కు కారు, దాని అవసరమైన ఖర్చులు ఇస్తున్నారని చెప్పారు. దీంతోపాటు ఒక్కో స్టేషన్‌కి ప్రతినెల నిర్వహణ ఖర్చుల కోసం రూ.20 నుంచి 50 వేలు మంజూరు చేస్తున్నారని తెలిపారు. రూ.12 వేలుగా ఉన్న హోంగార్డు జీతాన్ని రూ.20 వేలకు పెంచారన్నారు.
రైతులకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతుబీమా అందిస్తున్నారని చెప్పారు. తాజాగా రైతుబంధు కోసం రూ.6 వేల కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రైతులకు 365 రోజులు కాలువ నీళ్లు, కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ అని వెల్లడించారు. వ్యాపారులు కూడా రైతులు బాగుండేలా చూడాలన్నారు.