దేవరుప్పుల/పాలకుర్తి రూరల్, ఆగస్టు 27 : రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రధాన అస్ర్తాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం ఆయన జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని హఠ్యా తండా, భీక్యా నాయక్ పెద్ద తండా, టీఎస్కే తండా, పెద్ద తండా కేలో రూ.10 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా టీఎస్కే తండాలో గిరిజన మహిళలతో కలిసి మంత్రి నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వ ంలో అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతున్నదని అన్నారు. సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరడంతో పేదరిక నిర్మూలన జరిగిందని తెలిపారు.
తెలంగాణలో అన్ని వనరులు ఉండి ఉమ్మడి పాలనలో వెనుకబాటుకు గురైందని చెప్పారు. దీనికితోడు అవినీతి, తెలంగాణపై కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి లేకపోవడంతో అభివృద్ధిలో వివక్షకు గురైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశంలో తెలంగాణ ట్రేడ్ మార్కుగా నిలిచిందని అన్నారు. అభివృద్ధే ఆయుధంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో కేసీఆర్ పాలన వైపే ఫలితాలు పునరావృతమవుతాయని చెప్పారు. మరో దశాబ్దం బీఆర్ఎస్ పాలన ఉంటే దేశంలో అద్భుత శక్తిగా తెలంగాణ అవతరిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉనికిని కోల్పోయినట్టు తెలిపారు.