మహబూబాబాద్ : దళిత బంధు పథకం పేదలకు వరమని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగరలోని సాయి గార్డెన్లో తొర్రూరు ఎల్వై గార్డెన్స్‌లో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక ప్రకియపై సంబంధితశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మండలంలో విడతలవారీగా గ్రామాల ఎంపిక ప్రక్రియ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేపట్టి త్వరలోనే యూనిట్లను జాప్యం లేకుండా లబ్ధిదారులకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
అర్హులైన లబ్ధిదారులను గ్రామాల్లోనే దళిత సంఘాల నాయకులతో సమీక్షలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కేటగిరీలో అందజేస్తామని ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. దళితుల అభివృద్ధికి అమలు చేస్తున్న పథకం ఉద్యమ తరహాలో అభివృద్ధి జరుగుతుందన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో 1500 దళిత కుటుంబాలకు పథకం వర్తింపజేస్తామన్నారు. పథకం కోసం ఏటా రూ.25వేలకోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు.
గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులకు స్వచ్ఛందంగా చేతివృత్తిలో కుట్టు మిషన్లపై ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు రూ.10వేల విలువైన మిషన్లను అందిస్తామన్నారు. మహిళలు స్వశక్తితో ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రోత్సహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజేశ్వరి, జడ్పీటీసీలు శ్రీనివాస్, జ్యోతిర్మయి పాలకుర్తి దేవస్థానం చైర్మన్ రామచంద్రయ్య శర్మ, జిల్లా రైతుబంధు సమితి సభ్యులు నెహ్రూ, డీపీవో సాయిబాబా, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.