వరంగల్/మహబూబాబాద్: బీజేపీ (BJP) దొంగల పార్టీ అని, వారికి రైతులంటే గిట్టదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. పేదలను దోచాలె.. పెద్దలకు కట్టబెట్టాలన్నదే మోదీ (PM Modi) విధానమని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ (CM KCR)హయాంలోనే వ్యవసాయం పండుగలా మారిందని చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన మహాత్ముడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో (Kaleshwaram project) ప్రతి ఎకరానికి నీళ్లు అందించిన ఘనత ముఖ్యమంత్రిదేనని వెల్లడించారు. వరంగల్, మహబూబాద్ జిల్లాల్లోని పాలకుర్తి, తొర్రూరు, పెద్దవంగరలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను (Paddy procurement centres) మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రక్రియ ఆరంభమైందని చెప్పారు.
రైతుల కోసం మాత్రమే సీఎం కేసీఆర్ వేల కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పంటల కోసం ఎదురుపెట్టుబడి పెడుతున్నదని వెల్లడించారు. రాష్ట్రంలో ఈ యాసంగిలో 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. గత వానా కాలంలో కోటి టన్నుల ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. రాష్ట్రంలో 24 లక్షల టన్నుల నుంచి కోటి 41 లక్షల టన్నులకు వరి ధాన్యం ఉత్పత్తి పెరిగిందని, వరి సాగు విస్తీర్ణం 65 లక్షల ఎకరాలకు చేరిందన్నారు. గత ఎనిమిదేండ్లలో రూ.కోటి 7 లక్షల కోట్లను వరిధాన్యం సేకరణ కోసం పెట్టుబడి పెట్టామని తెలిపారు. ఈ యాసంగిలో వరి ధాన్యం మద్ధతు ధరను ఏ- గ్రేడ్ ధాన్యానికి రూ.2,060, బీ- గ్రేడ్ ధాన్యానికి రూ.2,040గా నిర్ణయించామన్నారు. రైతును రాజును చేయాలని సీఎం కేసీఆర్ ఆశిస్తున్నారని చెప్పారు.