అమెరికా : తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతులకు ఉచితంగా 24 గంటల ఇస్తుంటే 3 గంటలు ఉచిత విద్యుత్ చాలు అంటూ అమెరికాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. అమెరికాలో వున్న మంత్రి ఎర్రబెల్లి ఒక ప్రకటన విడుదల చేశారు. అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నెముక. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టే రైతుల గురించి ఆలోచించారని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతులను పట్టించుకోలేదు. పైగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. దేశాన్ని పాలిస్తున్న పార్టీలు వ్యవసాయం, రైతులను చులకనగా చూస్తున్నాయి. సీఎం కేసీఆర్ రైతు ఉన్నతికి రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టారు. ఈ పథకాల్లో ఏమి రాజకీయం ఉంతో ప్రతిపక్షాలకే తెలియాలన్నారు. రైతు పంట పండించుకోవడానికి ఉచిత కరంటు ఇస్తే అది తప్పా అని ప్రశ్నించారు.
కరెంట్ 3 గంటలు ఇస్తే రైతు బాగుపడుతాడా అనేది రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలని హితవు పలికారు. రైతులు అన్ని గమనిస్తున్నారు. సరైన సమయానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఏ రాజకీయం లేకుండా రైతుకు న్యాయం జరగాలన్న తపనతో పథకాలు అమలు చేస్తూన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా రైతులు సీఎం కేసీఆర్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటారని పేర్కొన్నారు.