రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతాలు సృష్టిస్తూ విజయ పథంలో పయనిస్తున్నదని, రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందనడానికి కేంద్ర గణాంకాలే నిదర్శనమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. తలసరి ఆదాయం వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలోనూ గణనీయమైన వృద్ధి రేటు సాధించిందన్నారు. 2021- 2022 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం 19.1 శాతం నమోదు కాగా జీఎస్డీపీలోనూ 19.46 శాతం వృద్ధి రేటు నమోదు చేసిందని మంత్రి తెలిపారు.
తెలంగాణలో 2014-2015 సంవత్సరంలో రూ.1,24,104 తలసరి ఆదాయం ఉండగా, 2021 -22 ఆర్థిక సంవత్సరానికి రూ.2,78,833 కి పెరిగిందన్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2014-2015 లో కేవలం రూ.5,05,849 కోట్లు ఉండగా 2021-2022 సంవత్సరంలో రూ.11,54,860 కోట్లు పెరిగిందని ఎర్రబెల్లి అన్నారు. విభజన సమస్యలు పరిష్కారం కానప్పటికీ కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ కేంద్రం నుండి ఎలాంటి సహకారం లేనప్పటికీ తెలంగాణ అభివృద్ధి సాధిస్తున్నదని స్పష్టం చేశారు. కేసీఆర్ అద్భుతమైన పాలన వల్లనే ఇది సాధ్యమైందని మంత్రి అన్నారు.