సినిమా పేరు: ఫంకీ
తారాగణం: విశ్వక్సేన్, కయాదు లోహర్, నరేష్, మిర్చి సంపత్..
దర్శకత్వం: కె.వి.అనుదీప్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య
యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ కథానాయకుడిగా ‘జాతిరత్నాలు’ వంటి బ్లాక్బాస్టర్ చిత్రానికి దర్శకుడైన కె.వి.అనుదీప్ దర్శకత్వంలో సినిమా అనగానే ‘ఫంకీ’పై ఆడియన్స్‌లో ఓ పాజిటివ్ బజ్ మొదలైంది. పైగా ప్రతిష్టాత్మక నిర్మాణం సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో కచ్ఛితంగా సినిమా బావుంటుందనే అంచనాలో ప్రేక్షకులు ఉన్నారు. మరి అందరి అంచనాలనూ ‘ఫంకీ’ అందుకున్నదా? కె.వి.అనుదీప్ ‘జాతిరత్నాలు’ లాంటి మ్యాజిక్ మళ్లీ చేశాడా? విశ్వక్సేన్ని విజయం వరించిందా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందు కథలోకి వెళ్లాలి..
కథ
కోమల్(విశ్వక్సేన్) దర్శకుడిగా తొలి సినిమా చేస్తుంటాడు. అనుకున్న దానికంటే బడ్జెట్ పెంచేయడంతో అవకాశం ఇచ్చిన నిర్మాత అనారోగ్యపాలవుతాడు. తన తండ్రిని ఈ స్థితికి తెచ్చిన కోమల్‌పై నిర్మాత కూతురు చిత్ర(కయాదు లోహర్)కి చెప్పలేనంత కోపం వస్తుంది. కోమల్ని దర్శకుడిగా తీసేస్తుంది. సినిమా ఆపేస్తుంది. ఇక ఎలాగొలా చిత్ర కోపాన్ని తగ్గించి సినిమాలు మళ్లీ మొదలుపెట్టాలని కోమల్ శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు. ఓ దశలో చిత్ర ఒప్పుకుంటుంది. మిగిలిన సినిమాను తాను చెబుతున్న బడ్జెట్లో కాకుండా కేవలం కోటి రూపాయల్లో పూర్తి చేయాలనే షరతుతో సినిమాను మళ్లీ మొదలు పెడుతుంది చిత్ర. ఈ ప్రయాణంలో కోమల్, చిత్ర మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇంతకీ కోమల్ అనుకున్న బడ్జెట్లో సినిమా పూర్తి చేయగలిగాడా? నిర్మాత కుమార్తె చిత్రను పెళ్లాడగలిగాడా? సినిమా తెరకెక్కించే క్రమంలో కోమల్‌కు ఎదురైన సమస్యలేంటి? వాటిని తను ఎలా అధిగమించాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ
దర్శకుడు అనుదీప్ కేవలం నవ్వించడానికే ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. కథలో కామెడీ ఉండాలి కానీ.. సినిమానే కామెడీ కాకూడదు. ఓ సింపుల్ లైన్‌ని సినిమాగా తీసుకొని ఫన్ మోడ్‌లో సినిమా అంతటినీ నడిపించాడు దర్శకుడు అనుదీప్. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలతో పాటు మధ్య వచ్చి వెళ్లిపోయే పాత్రలు సైతం సైటైర్లు వేస్తుంటాయి. దీనికోసం దర్శకుడు రాసుకున్న ఫన్నీ వన్లైనర్లు కొన్ని చోట్ల బాగానే పేలాయి. ఈ కథలో హీరోయిన్ని హీరో ప్రేమిస్తాడు. కానీ అమ్మతో కాసేపు ఫోన్లో మాట్లాడటాన్ని మాత్రం గలీజుగా ఫీలవుతాడు. బంధాలంటే అతనికి గలీజు. అది తప్పని హీరోయిన్ని ప్రేమించిన తర్వాత తెలుసుకుంటాడు. దీన్ని బట్టి హీరో పాత్ర చిత్రణని అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా దర్శకుడు అనుదీప్ ఈ కథలో బంధాలకు విలువివ్వాలని చెప్పాడు. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ ఉంటుంది.. కానీ వ్యక్తపరచుకునే అవకాశం, సందర్భం వారిద్దరికీ రాదు. ఈ నేపథ్యంలో ఇద్దరూ పడిన అంతర్మథనం బావుంది. అక్కడక్కడ దిల్‌రాజు, నాగవంశీ, కల్యాణ్‌కృష్ణ, హరీష్‌శంకర్, చిత్ర దర్శకుడు కె.వి.అనుదీప్.. వీరంతా సందర్భానుసారం అలా కనిపించి, ఇలా మాయమై సినిమాకు నిండుదనాన్ని తెచ్చారు. మొత్తంగా సినిమా ఆద్యంతం నవ్విస్తూ, నవ్వించడానికి ప్రయత్నిస్తూ సాగింది..
నటీనటులు
విశ్వక్సేన్ ఎప్పటిలాగే తనదైన జోష్‌తో ఆకట్టుకుంటాడు. ఈ కథలో ఆయన కొత్తగా చేయడానికి ఏం లేదు. ఉన్నంతలో బాగా చేశాడు. కథానాయిక కయాదు లోహర్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. తను చాలా అందంగా కనిపించింది. అంతే అందంగా నటించింది కూడా. నిర్మాత కూతురుగా ఆమె నటన ఈ సినిమాకు హైలైట్. ఇక నరేష్ ఎప్పటిలాగే తనదైన నటనా పటిమతో ఆడియన్స్‌ని కట్టిపడేస్తారు. మిచ్చి సంపత్ ఇందులో జీకే.. అనే కామెడీ విలన్‌గా కనిపిస్తారు. ఆయన కూడా అక్కడక్కడ నవ్విస్తారు. ఇక ఈ సినిమాలోని మిగతా తారాగణం కూడా పరిథిమేర రక్తికట్టించారు.
సాంకేతికంగా
కె.వి.అనుదీప్ సినిమా నేపథ్యంలో కూడిన కామెడీ ఎంటర్టైనర్గా ఈ కథ రాసుకున్నాడు. కథలో ఇంకాస్త సీరియస్‌నెస్ ఉంటే బావుండేది. కథ ఆద్యంతం లైటర్‌వేలో సాగింది. కథలో సంఘర్షణలు తక్కువ. అక్కడక్కడ హీరోకు ఎదురయ్యే సమస్యలను కూడా కామెడీగా సాగాయి. మొత్తంగా ఆడియన్స్‌ని నవ్వించే విషయంలో కొంతమేర కె.వి.అనుదీప్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. భీమ్స్ సిసిరోలియో సంగీతం బావుంది. కెమెరా వర్క్ డల్‌గా అనిపించింది. కలర్ గ్రేడింగ్ సరిగ్గా చేస్తే బావుండేది. మొత్తంగా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. కామెడీ సినిమాలను ఇష్టపడే వాళ్లకు, ముఖ్యంగా యూత్‌కి ఈ సినిమా నచ్చొచ్చు..
బలాలు
విశ్వక్, కయాదు లోహర్ మధ్య వచ్చే సీన్స్,
భీమ్స్ సంగీతం,
అనుదీప్ రాసుకున్న వన్ లైనర్లు..
బలహీనతలు
కథ, కథనాలు..
రేటింగ్ 2.75/5