చండూరు : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా చండూరు లోని 2వ, 3వ వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామస్థులు స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని మంత్రి అభ్యర్థించారు. బీ(టీ)ఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉందని అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి చేనేత కార్మికుడి ఇంటికి వెళ్లి మగ్గం నేసి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గృహనిర్మాణ కూలీల వద్దకు వెళ్లి పలకరించారు. మంత్రి ఎర్రబెల్లి తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.