హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పీహెచ్సీలను బలోపేతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులను ఆదేశించారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం)పై మంగళవారం ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎన్హెచ్ఎంలో భాగంగా అమలవుతున్న పల్లె, బస్తీ దవాఖానలు, పీహెచ్సీల పనితీరు మెరుగుపడాలని చెప్పారు. ఆయా దవాఖానల సిబ్బంది గర్భిణులకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తూ, వారికి మందులు సరైన సమయంలో అందిస్తూ, మాతాశిశు మరణాలను తగ్గించేందుకు ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు.
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని పేర్కొన్నారు. అర్హులైన నర్సులకు మిడ్ వైఫరీ శిక్షణ ఇప్పించి, ప్రభుత్వ దవాఖానల్లో సహజ ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై చర్చించారు. టీబీ, కుష్టు వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని, గ్రామ సభల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమీక్షలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, అదనపు డైరెక్టర్ డాక్టర్ అమర్ సింగ్, జేడీలు డాక్టర్ పద్మజ, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డాక్టర్ రాజేశం, డాక్టర్ జాన్ బాబు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ప్రసాద్, డాక్టర్ నందిత, డాక్టర్ శ్రీదేవి డాక్టర్ సుమిత్ర పాల్గొన్నారు.