Mallu Bhatti Vikramarka | బడంగ్‌పేట, ఆగస్టు 5: కలుద్దాం రమ్మని రైతులకు సమాచారం ఇచ్చి ఆపై కలవకుండా వెళ్లిపోయిన ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వస్తే సమయం ఇవ్వకుండా అవమానించారని మండిపడుతున్నారు. సమయం ఇవ్వలేనప్పుడు పిలవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్‌గూడ నల్లపోచ్చమ్మ దేవాలయంలో ఆదివారం జరిగిన బోనాల ఉత్సవాలకు మంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జనాన్ని పోగుచేసేందుకు భూములు కోల్పోయిన రైతులకు మంత్రి న్యాయం చేస్తారని రైతులకు చెప్పి ఓ నాయకుడు రైతులను తరలించారు. అయితే, వారిని కలవకుండానే మంత్రి వెళ్లిపోయారు. దీంతో సోమవారం ఉదయం 10 గంటలకు నాదర్గుల్లోని కాసుబాగు, హర్డ్‌వేర్ పార్క్ రైతులతో కలిసి డిప్యూటీ సీఎం భూమిని పరిశీలిస్తారని నమ్మించారు. ఇది నమ్మిన రైతులు సోమవారం ఉదయం భూమి దగ్గర పడిగాపులు కాశారు. పొలాలకు సంబంధించిన కాగితాలు పట్టుకొని ఎదురుచూశారు. పది గంటల సమయంలో రైతులకు మరో నేత ఫోన్ చేసి మంత్రి పొలాల దగ్గరకు రావడం లేదని సమాచారం ఇచ్చారు.
నాదర్గుల్ బస్టాండ్‌లో భట్టి విక్రమార్క కలుస్తారని చెప్పడంతో రైతులు తిరిగి పది గంటలకు అక్కడికి చేరుకున్నారు. డిప్యూటీ సీఎం ఆదిబట్లకు రాగానే పోలీసులు అప్రమత్తం అయ్యారు. రైతులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. తమకు సమయం ఇచ్చిన తర్వాత ఎందుకు పొమ్మంటున్నారని రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులకు రైతుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో భట్టి నాదర్గుల్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ కొందరు రైతులు భట్టి కారుకు అడ్డుగా వచ్చారు. వారితో మాట్లాడిన డిప్యూటీ సీఎం గుడి దగ్గరకు వస్తే మాట్లాడుకుందామని చెప్పారు. అక్కడ కూడా రైతులకు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత ఎవరైనా ఒకరు వచ్చి వినతిపత్రాలు ఇవ్వాలని మంత్రి నుంచి పిలుపొచ్చింది. ఆ వెంటనే మనసు మార్చుకుని తర్వాత తీసుకుంటామని చెప్పి అక్కడి నుంచి భట్టి వెళ్లిపోవడంతో రైతులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.