హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తేతెలంగాణ)/భీంపూర్: రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. 27 జిల్లాల్లో సింగిల్ డిజిట్ నమోదైంది. ఇక ఆరు జిల్లాల్లో 13 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా గ్రామాలను పొగమంచు కప్పేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది.
ఫలితంగా రానున్న రెండు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4డిగ్రీలు తకువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టి)లో 6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ చలికాలం అర్లి(టి)లో రాష్ట్రంలోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇది ఐదోసారి. హైదరాబాద్లో గరిష్టంగా 29 డిగ్రీలు, కనిష్ఠంగా 12 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.