ములుగు: వనదేవతలు సమ్మక్క, సారలమ్మ చిన్న జాతర (Medaram Jatara) బుధవారం ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈ నెల 15 వరకు నాలుగు రోజులపాటు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తలు అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. బెల్లం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. రూ.5.30 కోట్లతో మినీ మేడారం జాతరకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ 200 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. జంపన్నవాగు వద్ద స్నానాలు, దుస్తులు మార్చుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
కాగా, ప్రతి రెండేళ్లకోసారి జరిగే అమ్మవార్ల మహాజాతర అనంతరం వచ్చే ఫిబ్రవరిలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని మేడారం, కన్నెపల్లిలో సమ్మక్క, సారక్క పూజారులు ఆయా పూజా మందిరాల్లో మండెమెలిగే పండుగను నిర్వహిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తచేశారు. ఈ సందర్భంగా పూజారులు ఆయా గ్రామాల్లో డోలివాయిద్యాల నడుమ గ్రామదేవత, బొడ్రాయిల వద్ద ప్రత్యేక పూజలు చేసి, అనంతరం దుష్టశక్తులు గ్రామంలోకి రాకుండా బురుకు కట్టెలతో గ్రామ పొలిమేరలో మా మిడి ఆకులతో పాటు కోడి పిల్లతో తోరణాలు కడతారు.
అనంతరం పూజారులతో పాటు వారి కుటుంబసభ్యులు, బంధువులు సమ్మక్క-సారక్కల పూజా మందిరాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవార్ల మి నీ జాతర ముగిసే వరకు సమ్మక్క, సారక్క ప్రధాన పూజారులు కొక్కెర కృష్ణయ్య, కాక సార య్య అత్యం త నియమనిష్టలతో తల్లులకు పూజలు నిర్వహిస్తారు. బుధవారం రాత్రంతా గద్దెల వద్ద జాగారం చేసి అనంతరం ఒకరికి ఒకరు సాకను ఇచ్చిపుచ్చుకుంటారు. దీంతో మినీ జాతర ప్రారంభమవుతుంది. తల్లులను గద్దెల మీదకు తీసుకురావడం మినహా మహాజాతర సందర్భంగా అమ్మవార్లకు జరిగిన పూజా కార్యక్రమా లు యథావిధిగా కొనసాగుతాయి. బుధ, గురు, శుక్రవారాల్లో భక్తులు మొక్కులు చెల్లించుకున్న అనంతరం అమ్మవార్ల పూజా సామగ్రిని శుద్ధి చేసిన అనంతరం గుడిలో భద్రపరచడంతో మినీ జాతర ముగుస్తుంది.
వివిధ మార్గాల నుంచి వచ్చే వారికి రూట్ల కేటాయింపు
మినీ మేడారం జాతరకు వివిధ మార్గాల నుంచి వచ్చే భక్తులకు రోడ్డు మార్గాలతో పాటు రూట్లను కేటాయించినట్లు ఎస్పీ పీ శబరీశ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ నుంచి వచ్చే భక్తుల కోసం ఒక రూట్, భూపాలపల్లి, కరీంనగర్ మీదుగా రెండో రూట్, ఏటూరునాగారం, కొత్తగూడెం మీదుగా మూడో రూట్, ఆర్టీసీ బస్సుల ద్వారా పస్రా, తాడ్వాయి మీదుగా వచ్చే భక్తుల కోసం 4వ రూట్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వీవీఐపీ భక్తుల కోసం శ్రీరాంసాగర్ చెరువు పక్కన పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
ఆర్టీసీ స్పెషల్ బస్సులు
ఈనెల 12, 13, 14వ తేదీల్లో సమ్మక-సారలమ్మ మినీ మేడారం జాతర జరుగుతున్న నేపథ్యంలో బస్సుల సౌకర్యార్థం ఆర్టీసీ వరంగల్ రీజియన్ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం డీ విజయభాను తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఉదయం 6 గంటల నుంచి మేడారానికి బస్సులు నడుపుతున్నట్లు, ప్రత్యేక బస్సుల ఆపరేషన్ నిర్వహణకు హనుమకొండ, మేడారం బస్టాండ్‌లో ఆర్టీసీ అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అన్ని ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలు, ఆడపిల్లలకు మహాలక్ష్మీ పథకం వర్తిస్తుందని, ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. జాతర బస్సుల చార్జీలు ఎక్స్‌ప్రెస్ రూ.200(పెద్దలు), రూ.110( పిల్లలు), ఈ-ఎక్స్‌ప్రెస్ రూ.210(పెద్దలు), రూ. 120( పిల్లలు) ఉంటుందని ఆర్ఎం తెలిపారు.
జాతర పరిసరాల్లో కానరాని మరుగుదొడ్లు
అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకార్యర్థం జాతర పరిసరాల్లో మరుగుదొడ్లు కానరావడం లేదు. దీంతో మేడారం వచ్చే భక్తులు కాలకృత్యాలు ఎలా తీర్చుకోవాలనేది ప్రశ్నార్థకంగా మారింది. జాతరకు రూ. కోట్లు వెచ్చించి సౌకర్యాలు కల్పించామని చెబుతున్న ప్రభుత్వం, అధికారులు ఒక్క మరుగుదొడ్డిని కూడా ఏర్పాటు చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్, గద్దె ల వెనకభాగం, సారలమ్మ ఓట్గేట్ సమీపంలో, జంపన్నవాగు వద్ద సులభ్ కాంప్లెక్స్‌లు ఉండగా, ఐటీడీఏ క్యాంపు కార్యాలయం సమీపంలో మరో మినీ సులభ్ కాంప్లెక్స్ ఉంది. వీటిలో సుమారు 40 దాకా మరుగుదొడ్లు ఉన్నాయి. మినీ జాతరకు సుమారు 40 లక్షల మంది భక్తులకు ఈ టాయిలెట్లు సరిపోతాయా అనేది అధికారులకే తెలియాలి.
అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువగా చిలకలగుట్ట, శివరాంసాగర్ చెరువు, కొంగళమడుగు, కొత్తూరు. రెడ్డిగూడెం, కాల్వపల్లి చెక్‌పోస్టుల వద్ద విడిది చే స్తారు. ప్రస్తుతం అధి కారులు ఈ ప్రాంతాల్లో మ రుగుదొడ్లు ఏర్పాటు చేయకపోవడంతో వారంతా బహిరంగంగానే మల మూత్రవిసర్జన చేసే అవకాశం ఉంది. మామూలుగానే జాతరలో కోళ్లు, మేకల వ్యర్థాలతో దుర్వాసన కొడుతుంది. ఇప్పు డు మలమూత్ర విసర్జనలతో మేడారంతో పాటు గ్రామాలు కాలుష్యమయం కానున్నాయి.