Anganwadi Centers | హైదరాబాద్ మే 18 (నమస్తేతెలంగాణ): ‘ప్రమోట్ చేయడమే గొప్ప.. పెండింగ్ శాలరీలు మరిచిపోండి అంటూ ఉన్నతాధికారులు చులకనగా మాట్లాడుతున్నారు.. మంత్రికి విన్నవించినా పట్టించుకోవడమే లేదు’ ఇవీ అంగన్వాడీలుగా ప్రమోషన్ పొందిన మినీ అంగన్వాడీలకు ఎందురైన చేదు అనుభవం. ఈ దశలో ఇప్పటికైనా పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, లేదంటే ఉద్యమమే శరణ్యమని మినీ అంగన్వాడీ యూనియన్ నాయకులు తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్లను ప్రధాన అంగన్వాడీలుగా ప్రమోట్ చేసిన ప్రభుత్వం పెండింగ్ వేతనాలు అడిగితే ముఖం చాటేస్తున్నది.
12 నెలలకు సంబంధించి సుమారు రూ.28 కోట్ల పెండిగ్ వేతనాలను ఇవ్వకుండా మెండిచేయ్యి చూపుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీతక్క 2023 డిసెంబర్ 14న మినీ అంగన్వాడీలను అప్‌గ్రేడ్ చేసే ఫైల్ పైనే తొలి సంతకం చేశారు. ఒక్క సంతకంతోనే 3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్ల బతుకుల్లో వెలుగులు నింపినట్టు గొప్పగా చెప్పుకున్నారు. 2024 జనవరి నుంచే అమల్లోకి తీసుకొస్తున్నామని, ఇక నుంచి వారికి ప్రధాన అంగన్వాడీలతో సమానంగా ప్రతినెలా రూ.13,650 చొప్పున వేతనం అందుతుందని ప్రకటించారు.
మంత్రే స్వయంగా ఎక్స్‌లో ట్వీట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్లోనూ పోస్టులు పెట్టారు. కానీ మూడు నెలలు(జనవరి, ఫిబ్రవరి, మార్చి) పెరిగిన వేతనాలు జమచేసి మురిపించారు. మళ్లీ ఏప్రిల్, మే నెలల్లో కథ మొదటికొచ్చింది. తిరిగి రెండు నెలలు మే, జూన్‌లో మళ్లీ పాత వేతనాలైన రూ.7,600 చొప్పున ఇచ్చారు. ఇదేమిటని గగ్గొలు పెడితే జూలైలో పెంచిన జీతాలను జమచేశారు. ఆ తర్వాత నెల నుంచి తిరిగి పూర్వపు పద్ధతిలోనే వేతనాలు అందజేస్తూ వస్తున్నారు.
సర్కారు వైఖరిపై విసిగిపోయిన మినీ అంగన్వాడీ టీచర్లు అనేకసార్లు మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మీడియాలోనూ కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో దిగొచ్చిన సర్కారు మే 6న మినీ అంగన్వాడీ టీచర్లందరికీ పెరిగిన వేతనాలు అమలు చేస్తామని ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని సుమారు 10 జిల్లాల్లో ఏప్రిల్‌కు సంబంధించిన పెరిగిన వేతన నగదును జమచేశారు. మిగతా జిల్లాల అంగన్వాడీలకు మాత్రం ఇంతవరకు అందలేదని యూనియన్ నేతలు చెప్తున్నారు. 12 నెలల పెండింగ్ వేతనాల ఊసే ఎత్తడంలేదని వాపోతున్నారు. మంత్రి మొదటి సంతకానికే విలువ లేకపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నారు.