మాదాపూర్, సెప్టెంబర్ 9: చిన్నారుల ఆకలికేకలు.. కూలిన బతుకులతో ఆగని ఆర్తనాదా లు.. రాత్రంతా కంటిమీద కునుకులేకుం డా.. రెప్పవాల్చని కూలీల బతుకులు చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాకమానవు. వండుకునేందుకు సామాన్లు లేవు.. ఉండేందుకు గూడు లేదు. ఒక్కరోజులోనే వారి బతుకులు రోడ్డునపడ్డాయి. సర్కారు నిర్వాకంతో పేదవాని గూడు చెదిరింది. మాదాపూర్లోని సున్నం చెరువులో గుడిసెలు వేసుకున్న వలస కూలీల బతుకులన్నీ కన్నీటి వ్యథలే. ఆదివారం రాత్రి కూల్చిన చోటే బట్టలు అడ్డం కట్టుకొని పిల్లలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. రెక్కాడితేగానీ డొక్కాడని మా బతుకులపై రేవంత్ సర్కారు కక్ష కట్టిందని మండిపడ్డారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఓట్లేసి గెలిపిస్తే బతుకులు మారుతాయని కలలు గన్నాం.. కానీ మా బతుకులు కూలుస్తడని కలలో కూడా ఊహించలేదని కన్నీరు కార్చారు. కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తే.. రేవంత్ ఉన్న గూడుపై గునపాలు దించుతున్నాడని గుండెలు బాదుకున్నారు. చిన్న పిల్లలు ఉన్నారని దయాదాక్షిణ్యం లేకుండా హైడ్రా అధికారులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. కనీస సమయం ఇవ్వకుండా మా బతుకులను నేలమట్టం చేశారని సర్కారుపై దుమ్మెత్తిపోశారు.
ఒంటిపై కవర్లు కప్పుకొన్నాం
రేవంత్ సర్కార్ చేసిన పనికి పట్టరాని దుఃఖంతో రాత్రంతా కంటి మీద కునుకులేదు. పిల్లలపై కవర్లను కప్పి పడుకోబెట్టాం. వండుకుందామంటే సామాన్లు ధ్వంసమయ్యాయి. మా ఊరికెళ్దామంటే అక్కడ పని దొరకదు. ఇల్లు అద్దెకు అడిగితే రూ.10 వేల నుంచి రూ. 15వేలు చెబుతున్నరు. ఇంట్లో వారందరం కష్టపడితే వచ్చేది అంతంత మాత్రమే. అద్దె కడుతూ ఎలా బ్రతకాలి. రేవంత్ మాకు తీవ్ర అన్యాయం చేసిండు. ప్రభుత్వమే మాకు ఉంటడానికి ఏర్పాట్లు చేయాలె. – స్వప్న, కల్వకుర్తి (కూలీ)
ఓటేస్తే ఆగం చేశిండు
మాకు ఎంత కష్టమొచ్చినా ఇక్కడే ఉంటాం. మాకు వేరే దారి లేదు. ఇక్కడ పదేండ్ల నుంచి గుడిసెలు వేసుకొని బతుకుతున్నం. ఉన్నట్టుండి కూల్చివేతలు చేస్తే ఎలా? ప్రభుత్వానికి మా గోడు కనిపించదా? మా బ్రతుకులు అంటే అంత చులకనా? మా సొంతూరు అని ఓటును వేసి గెలిపించుకున్నం. మా బతుకులను ఆగం చేస్తాడనుకోలేదు. – చంద్రమ్మ, కోస్గి కొడంగల్ (కూలీ)
గణేశ్ మండపంలో తలదాచుకున్నం
ఈ ప్రభుత్వం తీరుతో మా బతుకులు రోడ్డునపడ్డాయి. మా పరిస్థితి పగ వారికి కూడా రాకూడదు. ఎంతటి కష్టం వచ్చినా ఎక్కడికైనా వెళ్లి బతకాలనుకున్న బతకలేం. ఇక్కడ గుడిసెలు వేసుకొని అద్దెలు లేకుండా ఉంటున్నాం. మా పిల్లలకు రాత్రంత నిద్రలేదు. దిక్కుతోచక గణేశ్ మండపంలో తలదాచుకున్నం. – శంకర్, వరంగల్ (కూలీ)
ఓ వైపు వర్షం.. మరో వైపు భయం
సర్కార్ నిర్వాకంతో వండుకోవడానికి సామాన్లు లేవు. పిల్లలకు తిండి పెట్టలేని దుస్థితి. రాత్రంతా ఏడుస్తూనే ఆకలితో పడుకున్నారు. రాత్రి సరిగా నిద్రలేక.. వర్షం పడితే ఎలా పడుకోవాలో అర్థంకాక భయంతో కంటిమీద కునుకు లేకుండా ఉన్నాం.
– లక్ష్మి, కర్నాటక (కూలీ)
ఏం చేయాలి.. ఎక్కడికి పోవాలి..?
ఉన్న గుడిసెను కూల్చారు. ఎక్కడికి పోవాలో తెలియదు. సర్కార్ మా బతుకులను ఆగం చేసింది. మా ఓట్లు కావాలి కానీ మేము ఎలా బతుకుతున్నామో అవసరం లేదా? రేవంత్ మా వద్దకు వచ్చి మా పరిస్థితిని కండ్లతో చూడు. పిల్లలు ఉన్నారన్న దయా దాక్షిణ్యం లేకుండా రేవంత్ సర్కార్ మాపై కక్ష కట్టింది.
– సుగుణమ్మ, మహబూబ్నగర్ (కూలీ)