MG University | నల్లగొండ జిల్లా : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. బాలికల హాస్టల్లో గత కొంతకాలంగా తాగునీరు, వినియోగ నీటి సమస్యలు తీవ్రంగా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీసీ గెస్ట్ హౌస్ ఎదుట ఆందోళన చేపట్టారు. తాగు నీరు, వినియోగ నీటిని అందించాలని నినాదాలు చేశారు.
హాస్టళ్లకు సరఫరా కావాల్సిన నీటిని నూతన భవన నిర్మాణాలకు మళ్లించడంతో తమకు నీటి సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. దీంతో రోజువారీ అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సమస్య తీవ్రరూపం దాల్చడంతో ఆందోళనకు దిగామని చెప్పారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనను వ్యక్తం చేశారు.

Mg University Students2
విద్యార్థినులు అర్ధరాత్రి సమయంలోనే వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్ దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ, సంబంధిత కేర్టేకర్లు, వార్డెన్లు తక్షణ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. విద్యార్థినుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం యాజమాన్యం మిస్ మేనేజ్మెంట్కు, బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.
బాలికల హాస్టల్లో తాగునీరు, వినియోగ నీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థినుల ఆరోగ్యం, పరిశుభ్రత, విద్యాభ్యాసంపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.వెంటనే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి హాస్టల్ పరిస్థితులను పరిశీలించాలని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అలాగే నిర్లక్ష్యం వహించిన సంబంధిత కేర్టేకర్లు, వార్డెన్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయ యాజమాన్యం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే, ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.