హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని ఖండిస్తున్నాం. ఈ రోజు కూడా బీఆర్ఎస్ నేతల అరెస్టులు జరిగాయి. వారిని వెంటనే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే మెతుక్ ఆనంద్(Methuku Anand )డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలనను అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్పారు. ఆరు గ్యారంటీలు అమలు కాలేదు. ఏడో గ్యారంటీ పత్తా లేదన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ కుటుంబ సభ్యులు రాజ్యాంగేతర శక్తులుగా మారి పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లాలో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి అధికారులు రాచ మర్యాదలు చేస్తున్నారు.లగచర్ల ఘటన తర్వాత వికారాబాద్ జిల్లా కలెక్టర్ తన కార్యాలయం నుంచి బయటకు వచ్చి మరీ స్వాగతం పలికారు
..ఇంతకుముందు ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? అని ప్రశ్నించారు.
తిరుపతి రెడ్డికి అధికారుల సమక్షంలో స్కూల్ విద్యార్థులను ఎండలో నిలబెట్టి మరీ స్వాగతం చెప్పడం సిగ్గు చేటన్నారు.కొండారెడ్డి పల్లిలో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్యకు కారకుడైన తిరుపతి రెడ్డి పై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదని ప్రశ్నించారు. సమస్యల నుంచి ద్రుష్టి మళ్లించేందుకు రేవంత్ రెడ్డి కేటీఆర్ పై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. అలవి కాని హామీలు ఇచ్చి రేవంత్ మాట తప్పారు. కాంగ్రెస్ నేతలు గ్రామాలకు వస్తే ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకుడు పంజగుల శ్రీశైల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.