హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇప్పటివరకు రైతులు ఎంత విద్యుత్తు వాడినా అడిగేవారు లేరు. చిన్న రైతు మూడు, నాలుగు గంటలు.. పెద్ద రైతు 14 నుంచి16 గంటలు విద్యుత్తు వాడినా ప్రశ్నించే సంస్థే లేదు. కానీ ఇంత విద్యుత్తు ఎందుకు వాడారు? ఇంత వినియోగం ఎందుకైంది? అని ప్రశ్నించే రోజులు రాబోతున్నాయా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. వ్యవసాయానికి వినియోగించే విద్యుత్తు ఎంత? అని కచ్చితమైన లెక్కలు తీసే రోజులు రానున్నాయి. ఆ లెక్కలు తీసిన తర్వాత బిల్లులు జారీ చేయడమే తరువాయి అన్న ప్రచారం కూడా జరుగుతున్నది. స్మార్ట్‌మీటర్లు పెట్టాలన్నది.. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్‌లో (ఆర్డీఎస్ఎస్) భాగం. విద్యుత్తు సరఫరాను మెరుగు పరిచేందుకు, నష్టాలను తగ్గించేందుకు ఈ స్కీమ్‌ను కేంద్రం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా అన్ని ట్రాన్స్ఫార్మర్లకు ఈ మీటర్లు పెట్టాలని కేంద్రం స్పష్టంచేసింది.
ఇప్పటికే తెలంగాణ డిస్కంలు ఈ స్కీంలో చేరగా , ఈ ఏడాది నవంబర్ వరకు రాష్ట్రం కేంద్రం నుంచి రూ.34 కోట్లు పొందింది.రాష్ట్రంలో 2,61,240 కిలోమీటర్ల పొడవైన ఎల్టీ వ్యవసాయ విద్యుత్తు లైన్లు ఉన్నాయి. వీటికి అనుబంధంగా 5,22,479 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఈ ఐదు లక్షలకు పైగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు సర్కారు కొత్తగా స్మార్ట్‌మీటర్లను బిగించనున్నది. వీటి సామర్థ్యం 19 వేల మెగావాట్లకు పైగా ఉంటుందని అధికారులు తేల్చారు. ఉత్తర డిస్కం పరిధిలో 2,30,418 ట్రాన్స్ఫార్మర్లు, దక్షిణ డిస్కం పరిధిలో 2,92,061 ట్రాన్స్ఫార్మర్లు ఉండగా, వీటన్నింటికీ స్మార్ట్‌మీటర్లను బిగించనున్నారు. ఆ తర్వాత ఒక ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని పంపుసెట్లు ఎంతమేరకు కరెంట్ వినియోగిస్తున్నాయన్న లెక్క లు తేలుస్తారు. ఆ తర్వాత బిల్లులు జారీచేస్తారని కొందరు అంటుండగా, బిల్లులు జారీచేస్తే వ్యతిరేకత వస్తుందని మరికొందరు అంటున్నారు. అధికారులు గ్రిడ్ నిర్వహణ, ఎనర్జీ ఆడిట్ కోసమేనని చెప్తుండటం గమనార్హం.
కొత్త స్మార్ట్‌మీటర్ల బిగింపు ఏప్రిల్ 1 తర్వాతే ప్రారంభంకానున్నట్టు సమాచారం. ఇందుకు ఈఆర్సీ అనుమతి కోరనున్నట్టు సమాచారం. ఈ అనుమతి లాంఛనమేనన్న భావనతో మీటర్ల బిగింపునకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దక్షిణ డిస్కం పరిధిలో 15,20,128, ఉత్తర డిస్కం కింద 13,69,793 చొప్పున వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. గడిచిన ఐదేండ్లలో వ్యవసాయ పంపుసెట్ల విద్యుత్తు వినియోగం 1,38,459 మిలియన్ యూనిట్లుగా లెక్కించారు. ఈ మేరకు ఐదు లక్షల ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లను బిగించేందుకు సర్కారు రూ.1,306 కోట్లను ఖర్చు చేయనున్నది.