హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : నైరుతి రుతుపవనాలు గురువారం దేశవ్యాప్తంగా మరింత విస్తరించాయని, వీటితోపాటు ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 8 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది.
శుక్రవారం జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఈదురుగాలుల బీభత్సం ఎక్కువగా ఉంటుందని, హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.
4వ తేదీ నాటికి వర్షాల తీవ్రత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి, అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనావేస్తున్నారు. 5వ తేదీ నాటికి వాతావరణం మరింత తీవ్రంగా రెండు, మూడురోజులు కొనసాగే అవకాశం ఉన్నదని చెప్పారు. దీంతో ప్రజలతోపాటు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లిలో అత్యధికంగా 10.86 సెం.మీ వర్షపాతం నమోదుకాగా, సిర్పూర్-టీలో 10.69 సెం.మీ, కౌటాలలో 10.27 సెం.మీ, వాంకిడిలో 6.25 సెం.మీ, కెరిమెరిలో 5.38 సెం.మీ చొప్పున నమోదైనట్టు అధికారులు వివరించారు.