హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): తమ సమస్యలు పరిష్కరించే వరకు ధాన్యం దించుకునే ప్రసక్తే లేదని మిల్లర్లు తేల్చి చెప్పినట్టుగా సమాచారం. ధాన్యం కొనుగోలు సమస్యలపై ప్రభుత్వం మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావుతో కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బుధవారం మిల్లర్లతో సమావేశమై కొనుగోళ్లు, సమస్యలపై చర్చించింది. ఈ సందర్భంగా మిల్లర్లు తమ సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. సన్నధాన్యం దించుకునే ప్రసక్తేలేదని, ఆ ధాన్యం వల్ల తాము నష్టపోతామని తేల్చి చెప్పినట్టుగా తెలిసింది. సన్నధాన్యం అవుట్‌టర్న్ రేషియో తేల్చిన తర్వాతే దించుకుంటామని చెప్పినట్టుగా తెలిసింది.
ఇక బిడ్డర్లు ధాన్యం ఎత్తకపోవడంతో మిల్లుల్లోనే ధాన్యం నిండిపోయిందని, ఇప్పుడిచ్చే ధాన్యం ఎక్కడ పెట్టాలని ప్రశ్నించినట్టుగా తెలిసింది. టెండర్ ధర తామే చెల్లిస్తామని, నెల రోజుల గడువు ఇవ్వాలని కోరినట్టుగా సమాచారం. ఇక దీనిపై స్పందించిన మంత్రులు.. మిల్లర్లు నిబంధనల ప్రకారం పని చేయాలని, లేదంటే సహించేది లేదని హెచ్చరించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సహకరిస్తామని తెలిపారు. వానకాలం ధాన్యం సేకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, సన్నధాన్యం, దొడ్డు ధాన్యం వేర్వేరుగా కొనుగోలు చేయాలని ఆదేశించారు.
వరద ముప్పు నివారణపై హైడ్రా సమీక్ష
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 ( నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ నగరంలో వరదలు, కారణాలు, ఉపశమనచర్యలపై బుధవారం హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో బెంగుళూరులో అనుసరిస్తున్న విధానాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కర్ణాటక రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ కేంద్రం మాజీ డైరెక్టర్ డా జీఎస్ శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులతో గ్రేటర్లో ప్రస్తుతం డిజాస్టర్ మేనేజ్మెంట్ పరిస్థితులపై చర్చించారు. వరద నీటి కాలువల ప్రవాహస్థాయిని అంచనా వేసేందుకు బెంగళూరులో అమర్చిన సెన్సార్ల ప్రయోజనాలపై తెలుసుకున్నారు. నాలాల్లో చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నగరంలో ఉన్న చెరువులన్నింటికీ అలుగులుండేలా, గొలుసుకట్టు చెరువుల లింక్‌ను పునరుద్ధరించి వరద సాఫీగా సాగేలా చూడడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో హైడ్రాకు చెందిన వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.