హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో పది, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు-2026 అందించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
బంజారాహిల్స్‌లోని కుమ్రంభీం ఆదివాసీభవన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో ప్రతిభావంతులైన 508 మంది విద్యార్థులను సన్మానించనున్నట్టు తెలిపారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు.
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖ నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమాన్ని వాయిదా వేయాలని పీఆర్టీయూ తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వేసవి సెలవుల్లో బడిబాట నిర్వహించడమేంటని ప్రశ్నించారు. 40-43 డిగ్రీల మండే ఎండల్లో ర్యాలీలను ఎలా నిర్వహించాలని ఆయన మండిపడ్డారు. జూన్ మొదటి వారంలో బడిబాటను నిర్వహించాలని కోరారు.