హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాలు, తెలంగాణ అభివృద్ధి మాడల్ మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలను కకావికలం చేస్తున్నాయి. ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్’ నినాదంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన నాయకులు, మేధావులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు, సైనికులు, రైతు ఉద్యమాల నాయకులు చేరి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే రైతుల హకుల సాధనకై అవిశ్రాంత పోరాటం చేస్తున్న ‘క్రాంతికారి షేతరీ పార్టీ’ అధ్యక్షుడు సతీశ్ సాల్వే తన పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీ ముఖ్యనేతలతో కలిసి బీఆర్ఎస్లో చేరారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ను విస్తరిస్తాం: సతీశ్ సాల్వే
రైతాంగ సంక్షేమం-వ్యవసాయాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీలో భాగస్వామ్యం అయ్యేందుకే క్రాంతికారి షేతరీ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేసినట్టు సతీశ్ చెప్పారు. బీఆర్ఎస్ను మహారాష్ట్రవ్యాప్తంగా విస్తరించి పటిష్టపరిచేందుకు శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర అణగారిన వర్గాల కోసం క్రాంతికారి షేతరీ పార్టీని స్థాపించామని, అయితే అంతకంటే మెరుగైన రైతు స్వాభిమాన బావుటాగా తమకు బీఆర్ఎస్ కనిపించటంతో తమ పార్టీని విలీనం చేశామని వెల్లడించారు.
వరుస చేరికలతో బీఆర్ఎస్ దూకుడు
బీజేపీ, కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ, ఆప్ పార్టీల నుంచే కాకుండా షెత్కారీ, సామాజిక, సేవా రంగాలకు చెందిన మేధావులు బీఆర్ఎస్కు క్యూ కడుడుతున్నాయి. దీంతో మహారాష్ట్రలోని తలపండిన ఆయా పార్టీల నేతలకు బీఆర్ఎస్ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చరణ్ జీ వాఘ్మరే నేతృత్వంలో బీజెపీ, కాంగ్రెస్, శివసేనతోపాటు పలు ఇతర పార్టీల నాయకులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నాగ్పూర్ జిల్లా ఉమ్రేడ్ తాలూకాకు చెందిన సందీప్ కాంబ్లే, మాణిక్ జకారియా, సుయాష్ జైశ్వాల్, రఘునాథ్ మసీ, కైలాష్ బవానే, గోండా జిల్లాకు చెందిన నంద కుమార్ బైసెస్, నరేంద్ర ఠాకూర్, నితీశ్ కుమార్ ఎన్ సాహా, సంతోష్ సింగ్, హరిప్రసాద్ నవ్లఖే, చంద్రపూర్ జిల్లాకు చెందిన అశ్విన్ ఖోబ్రగడే, షర్మిల బిశ్వాస్, ఆనంద్ తగడే, ప్రవీణ్ భడ్ భుజే, ప్రతీక్ వాంకర్, బబ్లూ చిటాల, లక్ష్మణ్ గంగారాం పాటిల్, ఏపీఎంసీ డైరక్టర్ సందీప్ లక్ష్మణ్ పాటిల్, ఎన్సీపీ నేతలు ఈశ్వర్ పాటిల్, వంచిత్ బహుజన్ అఘాడీ నుంచి భగవాన్ ధాంగర్, మాజీ ఐఏఎస్ టీకే బాగుల్, ప్రణవ్ గైక్వాడ్, హీరామన్ జాదవ్, వినయ్ నికమ్, దివ్యాంగ్ అఘాడీ ప్రెసిడెంట్ దిలీప్ దిఘే, రవీంద్ర శిర్సాగర్, అజిత్ నాలే, విజయ్ పెల్మహ్లే, ఏక్నాథ్ ముర్తాదక్, ప్రొఫెసర్ అశోక్ న్యహారర్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు.