Telangana | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిస్తేనే పెండింగ్ జీతాలు విడుదలవుతాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. తాజాగా మెప్మా ఆర్పీలకు జీతాలు విడుదలవడం అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. రాష్ట్రంలో మెప్మా ఆధ్వర్యంలో పని చేస్తున్న ఆర్పీల జీతాలు ఇవ్వాలని శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. తమకు ఏడు నెలలుగా జీతాలు విడుదల చేయడం లేదని, వాటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
స్పందించిన సీఎం వెంటనే జీతాలివ్వాలని మెప్మా డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారం గత జూన్ నుంచి నవంబర్ వరకు పెండింగ్ ఉన్న రూ.20.30 కోట్లు విడుదల చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 1,054 మంది, జిల్లాల పరిధిలో 4,586 కలిపి మొత్తం 5,640 మందికి జీతాలు విడుదలైనట్టు పేర్కొన్నారు. ఏడు నెలలుగా నిలిచిపోయిన జీతాల కోసం సీడీఎండీ ముట్టడి, ఇందిరా పార్కు వద్ద ధర్నాలు, నిరసనలు చేపట్టినా విడుదల కాని జీతాలు, సీఎం రేవంత్‌ను కలిసిన వెంటనే విడుదల కావడంపై చర్చనీయాంశంగా మారింది.