హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజాసమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు బలపడాల్సిన అవసరముందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దేశంలో పేదప్రజలకు కూడు, గూడు వంటి సదుపాయాలు కమ్యూనిస్టుల ఉద్యమాలతోనే సమకూరుతాయనే నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఐక్య ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభను శనివారం రవీంద్రభారతిలో నిర్వహించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు బీ వినోద్, వీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డీ రాజా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రొఫెసర్ హరగోపాల్, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సీపీఐ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురవరంపై రూపొందించిన గేయాన్ని విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఆ తరువాత సభనుద్దేశించి మాట్లాడుతూ.. కేంద్రంలో ఏ ప్రభుత్వం మారినా అందుకు కమ్యూనిస్టులే కారణమని తన నమ్మకమని చెప్పారు.
సురవరం సుధాకర్‌రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచేవిధంగా క్యాబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంతకుముందు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. పీడిత ప్రజలు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సురవరం సుధాకర్‌రెడ్డి జీవితాంతం పనిచేశారని అన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం పాటుపడిన అరుదైన నాయకుడు సురవరం అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. సురవరం జీవితాన్ని చూస్తే నిస్వార్థంగా ప్రజల కోసం జీవించడం ఎలాగో అర్థమవుతుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు. దశాబ్దానికి పైగా సురవరం, తాను కలిసి కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినట్లు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు తెలిపారు. సురవరం ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కమ్యూనిస్టులు ఐక్యంగా ముందుకు వెళ్లాలని తమ్మినేని పిలుపునిచ్చారు. కమ్యూనిజం ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు.
తెలంగాణ ఏర్పాటుపై సురవరం మద్దతు :వినోద్‌కుమార్
దివంగత నేత సురవరం సుధాకర్‌రెడ్డి గొప్ప మానవతావాది అని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ కేంద్ర కమిటీ విశాలాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని, అయినప్పటికీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సురవరం.. ప్రణబ్‌ముఖర్జీకి నేరుగా తెలంగాణ ఏర్పాటుపై కేంద్రప్రభుత్వానికి ఇష్టం ఉంటే అనుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించారని తెలిపారు.
సురవరం ఆదర్శం : శ్రీనివాస్‌గౌడ్
దివంగత సురవరం సుధాకర్‌రెడ్డి నేటి యువతకు, రాజకీయ నాయకులకు ఆదర్శనీయుడని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. విద్యార్థి నాయకుడి నుంచి జా తీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగిన గొ ప్ప విలక్షణమైన వ్యక్తి అని కొనియాడారు. కా ర్మిక సంస్కరణలకు పాటుపడ్డారని తెలిపారు.