హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : సుంకిశాల ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, మేఘా ఇంజినీరింగ్ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేస్తున్నట్టు మంగళవారం ఎక్స్‌వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. సుంకిశాల ఘటనకు కారణమైన మేఘా ఇంజినీరింగ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోకుండా వారికి రూ.4,350 కోట్ల విలువైన కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను బహుమతిగా ఇవ్వబోతున్నారని తెలిపారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అని, తెలంగాణ సంపదను దోపిడీ చేసే కంపెనీ అని నాడు ముద్రవేసిన కంపెనీ పట్ల ఈ దాతృత్వం, ప్రేమ ఎందుకని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధ్వానం
పోలీసుల వేధింపులకు విసిగి వేసారిన నిజామాబాద్‌లోని ఓ స్వీట్ షాపు యజమాని తన షాపు ముందు ‘పోలీసుల వేధింపుల కారణంగా షాపు మూసేస్తున్నా’ అని భారీ బ్యానర్ కట్టాడని కేటీఆర్ తెలిపారు. ఓ వైపు నిజామాబాద్‌లో చిరు వ్యాపారులను వేధించే పనిలో పోలీసులు నిమగ్నమైతే మరోవైపు వరంగల్‌లో ఏకంగా ఓ ఏసీపీ మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని హల్చల్ చేశారని గుర్తుచేశారు. కేక్‌కట్ చేయడమే కాకుండా పటాకులు పేల్చడంతో రోడ్డుపై ఉన్న నలుగురు అమాయకులు గాయపడ్డారని, వారిని ఎంజీఎంకు తరలించారని తెలిపారు. మహబూబాబాద్‌లో మూడు రోజుల క్రితం గూండాల వేధింపులకు 17 ఏండ్ల బాలిక ఆత్మహత్యాయత్నం చేసిందని, మూడు రోజులపాటు దవాఖానలో ప్రాణాలతో పోరాడిందని, తన సోదరులను మళ్లీ చూడలేనన్న బాధతో మరణానికి కొన్ని గంటల ముందు వారికి రాఖీ కట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ హృదయ విదారక వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిందని పేర్కొన్నారు. ఘటన జరిగి నాలుగు రోజులు గడిచినా పోలీసుల చర్యలు శూన్యమని కేటీఆర్ విమర్శించారు.