మామిళ్లగూడెం, మే 21 : ఖమ్మం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎస్బీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్‌తో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం జాబ్‌మేళా నిర్వహించిన సీపీ, కలెక్టర్‌ను అభినందించారు. ఈ జాబ్‌మేళాలో 150 కంపెనీల్లో 8,200 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. ఆదివారం 5,025 మందికి నియామక పత్రాలు అందజేయగా మరో 3 వేల మందికిపైగా అభ్యర్థులకు రెండ్రోజుల్లో అందజేయనున్నట్టు సదరు కంపెనీల ప్రతినిధులు ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్బీఐటీ విద్యాసంస్థల చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, మేయర్ నీరజ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.