హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : దక్షిణాది రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం కత్తిగట్టిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. దక్షిణాదిపై కేంద్రం చేస్తున్న దాడిని అన్ని పార్టీలు, పాలకపక్షాలు కలిపి సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గురువారం అసెంబ్లీలో డీ లిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు, అనుసరించబోయే విధివిధానాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో పారదర్శకమైన సంప్రదింపులు లేకుండా జరుగుతున్న కసరత్తుపై ఈ సభ తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నదని పేర్కొన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పక్షాలతో విసృ్తతమైన సంప్రదింపుల తర్వాత పునర్విభజన కసరత్తును పారదర్శకంగా చేపట్టాలని సభ కోరుకుంటున్నదని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనకు జ నాభా ఒకటే ప్రామాణికం కాకూడదని చె ప్పారు. పార్లమెం ట్ సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలని, రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ఇ ప్పుడున్న నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేర్పులు చేయాలని కోరారు. తాజా జనాభా లెకలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలని, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగేలా కేంద్రం వ్యవహరిస్తే, కచ్చితంగా అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిద్దామని, అవసరమైతే పోరాటబాట పడుదామని చె ప్పారు. కేంద్రానికి 36% పన్నులు చెల్లిస్తు న్నా మనకు ఇచ్చే విషయంలో కేంద్రం వెనకాడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ వివక్షలకు వ్యతిరేకంగా త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, కే కేశవరావు ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని, అందరూ రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153 వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తున్నదని సీఎం చెప్పారు.