Congress | హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పరిస్థితిపై ఆ పార్టీ అధిష్ఠానం ఓ అంచనాకు వచ్చినట్టున్నది. రోజురోజుకు పరిస్థితి ‘చేయి’దాటిపోతుండటంతో రాహుల్‌గాంధీ నమ్మినబంటు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్జ్ మీనాక్షి నటరాజన్‌ను అధిష్ఠానం రంగంలోకి దించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన మరుసటి రోజే ఆమె హుటాహుటిన హైదరాబాద్‌లో వాలిపోయారు. ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డికి రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, అదే సమయంలో మహేశ్‌కుమార్‌గౌడ్ కుటుంబసభ్యులకు కూడా ప్రత్యేకంగా సమయం ఇవ్వడంతో రాహుల్‌గాంధీకి, రేవంత్‌రెడ్డికి మధ్య పొసగడం లేదనే అభిప్రాయాలు మరింత బలపడ్డాయి. మంత్రి పదవులు, పీసీసీ కార్యవర్గ పదవుల పంపకంపై ఈ ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలున్నట్టు తెలిసింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి మూడు రోజులపాటు ఢిల్లీలో ఉన్నప్పటికీ రాహుల్‌గాంధీని కలవకుండానే హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పరిణామాలు రాష్ట్రంలో ఏమైనా ప్రభావం చూపుతాయనే భావనో, లేక పరిస్థితులు చక్కదిద్దాలనే ఆలోచనో తెలియదు కానీ, మీనాక్షి నటరాజన్ ఆగమేఘాలపై హైదరాబాద్‌కు చేరుకున్నారు.
సమన్వయం ఎలా ఉన్నది?
బుధవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న మీనాక్షి నటరాజన్.. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా సమీక్ష నిర్వహించారు. తొలిరోజు ఆదిలాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె ఆరా తీసినట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉన్నది? ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? క్షేత్రస్థాయిలో పార్టీలో, ప్రభుత్వంలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి? స్థానికంగా ఏమైనా సమస్యలున్నాయా? నియోజకవర్గ నేతల మధ్య సమన్వయం ఏవిధంగా ఉన్నది? అనే అంశాలపై ఆమె ఆరా తీసినట్టు తెలిసింది. సమస్యలు ఏమీలేవన్న వారితో రెండు మూడు నిమిషాల్లోనే భేటీ ముగించగా, సమస్యలు ఉన్నాయని చెప్పినవారితో ఎక్కువ సమయం మాట్లాడినట్టు తెలిసింది. సమస్య ఏమిటి? ఎవరెవరి మధ్య ఉన్నది? దానికి పరిష్కారం ఏమిటి? అనే అంశాలపై అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.
పదవుల పంపకంపై కసరత్తు
ఢిల్లీలో జరిగిన చర్చల్లో మంత్రి పదవులు, పీసీసీ కార్యవర్గ పదవుల పంపకం దాదాపు కొలిక్కి వచ్చినట్టేనని భావిస్తున్నారు. ఈ నెల 30న మరోసారి జరిగే భేటీలో పదవులు ఖరారయ్యే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, కీలక నేతల అభిప్రాయాలను కూడా మీనాక్షి నటరాజన్ సేకరించినట్టు తెలిసింది. తన వద్దకు వచ్చిన వారందరినీ ‘మీకు ఏ పదవి కావాలి? మీకు ఏం సమస్యలున్నాయి? అని అడిగినట్టు సమాచారం. దీనికి కొందరు ఏదైనా పర్వాలేదని చెప్పగా, మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం తమకు ఫలానా పదవి కావాలని కోరినట్టు తెలిసింది. ఈ అభిప్రాయ సేకరణ ద్వారా పదవుల తుది జాబితాను రూపొందిస్తారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నది.నిబంధనలకు విరుద్ధంగా మీనాక్షి సమావేశంహైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలతో మీనాక్షి నటరాజన్ సమావేశం నిర్వహించడం వివాదాస్పదమైంది.
పార్టీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఏవిధంగా నిర్వహిస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలు, మీటింగ్‌లు క్వార్టర్స్‌లో నిర్వహించొద్దని అసెంబ్లీ సెక్రటేరియట్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటమే ఇందుకు కారణం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే 2024 జూలై 5న అసెంబ్లీ సెక్రటేరియట్ నుంచి ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘ఈ క్వార్టర్స్ కేవలం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల కోసం కేటాయించినవి. ఇందులో వారికి సంబంధించిన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కాబట్టి, వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు క్వార్టర్స్‌లో పార్టీ కార్యక్రమాలు, ప్రచారాలు, ప్రెస్మీట్లు వంటివి నిషేధిస్తున్నాం’ అని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ, సొంత ప్రభుత్వంలో వచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ మీనాక్షి నటరాజన్ దర్జాగా క్వార్టర్స్‌లో సమావేశం నిర్వహించడం గమనార్హం.
నేడు ఢిల్లీకి మాదిగ ఎమ్మెల్యేలు!
తమకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్‌పై కాంగ్రెస్ పార్టీకి చెందిన మా దిగ ఎమ్మెల్యేలు పట్టువీడటం లేదు. ఈక్రమంలోనే గురువారం ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఖర్గే అపాయింట్మెంట్ లభించిన వెంటనే ఢి ల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు ఒక పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న దామోదర రాజనర్సింహ అసలైన మాదిగ కాదనే వాదనను వినిపిస్తున్నారు. మాదిగ ఎమ్మెల్యేలు మందుల సామేలు, లక్ష్మణ్, లక్ష్మీకాంతరావు, సత్యనారాయణ, వేముల వీరేశం బుధవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో జరిగిన భేటీలో పలు విషయాలపై ప్రస్తావించినట్టు సమాచారం.