Meenakshi Natarajan | హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చిన తర్వాత అనతి కాలంలోనే ప్రభుత్వంపై ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మంత్రుల మీద పెద్ద ఎత్తున వస్తున్న 10 %ం, 30% కమీషన్ల ఆరోపణల్లో వాస్తవం ఏంత? అని కాంగ్రెస్ నేతలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఆమె ఆదివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో వరంగల్, నాగర్‌కర్నూల్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నాయకులతో సమావేశమయ్యారు. ఆయా ప్రాంతాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతో వేర్వేరుగా మాట్లాడారని తెలిసింది. కాంగ్రెస్ పాలనపై, క్షేత్రస్థాయి పరిస్థితులపై వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్టు చెప్తున్నారు.
కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై రైతులు, ప్రజలు ఏమనుకుంటున్నారని మీనాక్షి ఆరా తీసినట్టు సమాచారం. కాళేశ్వరం కూలిపోయిందని రైతులు నమ్ముతున్నారా? అని వరంగల్ నేతలను అడిగినట్టు తెలిసింది. కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలకు విశ్వాసం సడలలేదని, ఆయనకు నోటీసులు ఇవ్వడాన్ని ప్రజలు రాజకీయ కక్షగానే చూస్తున్నారని, రైతులు మాత్రం గుంభనంగా ఉన్నారని నేతలు ఆమెకు వివరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మంత్రుల మధ్య విభేదాలపై వరంగల్ నేతలను అడిగినప్పుడు వారు మంత్రి కొండా సురేఖపై పలు ఫిర్యాదులు చేశారని సమాచారం. మంత్రి వర్గం నుంచి ఆమెను తొలగించి పార్టీని కాపాడాలని మీనాక్షిని కోరినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలో నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడంపై మీనాక్షి ప్రత్యేకంగా ఆరా తీసినట్టు తెలిసింది. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? 30 పర్సెంట్ కమీషన్ తీసుకునే మంత్రి ఎవరు? అంటూ ప్రత్యేకంగా ప్రశ్నించి, వివరాలు సేకరించినట్టు చెప్పుకుంటున్నారు. 12 పర్సెంట్ కమీషన్ తీసుకునే మంత్రి ఎవరు? మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు ఎంత వరకు నిజం? ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి పదవులు పొందటానికి ఎవరెవరు అర్హులు ఉన్నారు? ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరినైనా తొలిగించాలా? అని నాగర్‌కర్నూల్ నేతలను అడిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి జిల్లాలో మాదిగ నాయకుల బలాబలాలు, క్షేత్రస్థాయిలో కుల చైతన్యం ఉన్నదా? అని కూడా ఆరా తీసినట్టు తెలిసింది.
నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, పార్టీ బలోపేతానికి ఇంకా ఏమేం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయా, ప్రజలు ఏమనుకుంటున్నారు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టి వివరాలు సేకరించినట్టు తెలిసింది. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పరిస్థితిపై ఆరా తీసినట్టు సమాచారం. ఎక్కువ మంది నేతలు రాష్ట్రంలో విద్యుత్ కోతలు, విత్తనాల కొరత ఉన్నదని ఆమె దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి గల కారణాలను వివరించారని, వాటిని ఆమె నోట్ చేసుకున్నారని చెప్పుకుంటున్నారు. ఇక మీ ప్రాంతంలోని ముఖ్య నేతల మధ్య సఖ్యత ఎలా ఉన్నదని మీనాక్షి అడిగినప్పుడు.. ‘ఏ ఇద్దరు మంత్రుల మధ్య కూడా సఖ్యత లేదు’ అని నేతలు కుండబద్దలు కొట్టినట్టు సమాచారం.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌రెడ్డి 15 నిమిషాల పాటు మీనాక్షి నటరాజన్‌తో ప్రత్యేకంగా భేటీ అయినట్టు తెలిసింది. తాను పార్టీ కోసం త్యాగం చేశానని, మంత్రి పదవికి అర్హుడనని, మంత్రి వర్గ విస్తరణలో తన పేరును పరిశీలించాలని అద్దంకి దయాకర్ కోరినట్టు సమాచారం.