హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేస్తున్నది జనహిత పాదయాత్ర కాదని.. ఆరు గ్యారెంటీల అంతిమయాత్ర అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. జనంలేక పాదయాత్ర వెలవెలబోతుండటంతో అంతుపట్టని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్.. పార్టీ నేతలపై అసహనం వ్యక్తంచేస్తున్నారని విమర్శించారు.
ఆదివారం తెలంగాణ భవన్లో జీవన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రవచనాలు చెప్పే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. తమ కుటుంబ బానిసత్వానికి తెలంగాణను ప్రయోగశాలగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డిని డమ్మీ సీఎంగా మార్చుకొని ఢిల్లీ చుట్టూ తిప్పుకుంటున్నారని, మీనాక్షిని రాజ్యాంగేతర శక్తిగా మార్చి రాష్ట్రంలో తిప్పుతున్నారని విరుచుకుపడ్డారు.