Medigadda Barrage | మహదేవపూర్, మార్చి 3: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌లో కుంగిన పిల్లర్ల వద్దకు మళ్లీ భారీగా వరద వచ్చి చేరుతున్నది. ముందస్తు చర్యలు పాటించడంలో అధికారులు తరచూ విఫలం కావడంపై ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 18న అన్నారం బరాజ్ గేట్లు ఎత్తడంలో గోదావరి, మహారాష్ర్ట ప్రాణహిత నదితో కలిసి మేడిగడ్డ బరాజ్‌కు సుమారు 19 వేల క్యూసెక్యుల వరద పోటెత్తింది.
భారీ వరద నీరు కుంగిన పియర్ల చుట్టూ చేరితే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని తెలిసీ కూడా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం, ముందస్తు చర్యలను గాలికొదిలేసిన తీరుపై కండ్లకు కట్టినట్టు ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో ప్రధాన వార్తగా ప్రచురితమైన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు వరద తగ్గాక నీటి మళ్లింపునకు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టడంపై ప్రజలు, మేధావులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నష్ట నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. మార్చి ఒకటిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమం నేపథ్యంలో అధికారులు హడావిడిగా బరాజ్‌లో కుంగిన పిల్లర్ల వద్ద ఉన్న వరద నీరు, ఇసుక, బురద, మట్టిని పూర్తిగా తొలగించారు.
మేడిగడ్డను పరిశీలించిన కేటీఆర్ బృందం బరాజ్‌లో ఏర్పడిన సమస్యలను నిపుణులతో గుర్తించి వెంటనే పూర్తి స్థాయిలో మరమ్మతు పనులు ప్రారంభించి బరాజ్‌ను పునరుద్ధ్దరించి రైతులకు నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. బరాజ్‌పై రాజకీయం చేయొద్దని, రైతులను పగ పట్టొద్దని బరాజ్‌లో రిపేర్లు చేసి రాష్ర్టానికి కల్పతరువుగా ఉన్న మేడిగడ్డను వినియోగంలోకి తేవాలని తెలిపిన విషయం తెలిసిందే.
కేటీఆర్ మేడిగడ్డ పర్యటన నేపథ్యంలో హడావిడి పనులు చేసి వరద రాకుండా చేసిన అధికారులు మరుసటి రోజునుంచి బరాజ్ వైపు వస్తున్న వరదను కట్టడి చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బరాజ్‌లోని ఏడో బ్లాక్‌లో కుంగిన 19,20,21వ పిల్లర్ల వద్దకే ఆదివారం మళ్లీ భారీగా వరద వచ్చి చేరింది. పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
కొంతకాలంగా బరాజ్ వద్ద జరుగుతున్న పనుల తీరు, తాజా పరిస్థితులు గమనిస్తే అధికార యంత్రాంగం కావాలనే బరాజ్‌ను గాలికొదిలేసి నష్టాన్ని మరింత పెరిగేలా చేస్తున్నదా? అనే అనుమానాలు రైతులు, ప్రజల్లో వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు బరాజ్‌పై కుట్రలు మానుకొని పూర్తి స్థాయిలో మరమ్మతు పనులు చేపట్టి ఆదుకోవాలని రైతులు, ప్రజలు వేడుకుంటున్నారు.