జగిత్యాల, జనవరి 5: ప్రమాదంలో కాలు విరిగి 108 అంబులెన్స్‌లో వచ్చిన ఓ వృద్ధుడు నొప్పితో తల్లడిల్లుతున్నా దవాఖాన సిబ్బంది లోపలికి తీసుకెళ్లని అమానవీయ ఘటన జగిత్యాల జిల్లా దవాఖాన వద్ద సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన జంగ రాజ నర్సయ్యకు ప్రమాదంలో కాలు విరిగింది. కుటుంబసభ్యులు 108లో జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు తీసుకురాగా, అరగంట దాటినా సిబ్బంది లోపలికి తీసుకెళ్లేందుకు రాలేదు. పలుమార్లు రాజనర్సయ్య బంధువులు వెళ్లి సిబ్బందిని వేడుకున్నా పట్టించుకోలేదు.
చేసేదేమిలేక రాజనర్సయ్య కోడలు సత్తవ్వ స్ట్రెచర్‌పై అతడిని దవాఖానలోకి తీసుకెళ్లింది. అత్యవసర పరిస్థితుల్లో దవాఖానకు వస్తే సిబ్బంది పట్టించుకోకపోతే ఎలా..? ఇదేం పద్ధతి అంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దవాఖానల పరిస్థితి అధ్వానంగా మారిందని, స్థానిక ఎమ్మెల్యే వైద్యుడిగా ఉండీ ఏం ప్రయోజనం అని మండిపడ్డారు. దవాఖానల్లో కనీస సౌకర్యాలు లేవని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోగులు వాపోతున్నారు.