Medchal | జవహర్‌నగర్, ఏప్రిల్ 5 : పది పరీక్ష పత్రాల మూల్యాంకానికి రాని 385 మంది ఉపాధ్యాయులకు మేడ్చల్ విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరిలో దాదాపు ఏడాది క్రితం మరణించిన ఒక ఉపాధ్యాయురాలికి నోటీసుల రావడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జవహర్‌నగర్ జడ్పీహెచ్ఎస్లో ఎన్. గీత 2016-2023 వరకు సాంఘిక శాస్త్రం టీచర్‌గా పనిచేశారు. 2023 మే నెలలో క్యాన్సర్ వ్యాధితో ఆమె మృతి చెందారు.
ఉపాధ్యాయురాలు మృతి చెందిన దాదాపు ఏడాది తర్వాత షోకాజ్ నోటీసులు జారీ చేయడం మేడ్చల్ విద్యాశాఖ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నదని ఉపాధ్యాయ సంఘాలు, సోషల్ మీడియా వేదికగా పలువురు మండిపడుతున్నారు. ఈ విషయమై హెచ్ఎం ఆజాంను వివరణ కోరగా జిల్లా అధికారులు ప్రధానోపాధ్యాయుల వాట్సాప్ గ్రూపులో షోకాజ్ నోటీస్ పోస్ట్ చేశారని, అందులో మృతిచెందిన గీత పేరు ఉండటంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.