మొయినాబాద్, ఆగస్టు 26: జెండా రంగులతో సంబంధంలేకుండా ప్రభుత్వ భూములను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని.. ఎవరైనా అడ్డొస్తే బుల్డోజర్లు వారిపైకి ఎక్కించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల ఒకటి నుంచి 15వరకు నిర్వహించనున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సోమవారం రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలంలోని చాం దినీ గార్డెన్లో జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథులుగా మెదక్, చేవెళ్ల ఎంపీలు రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ.. పెద్దలను వదిలి పేదల నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను చెరపట్టిన వారు ఎంతటివారైనా ఉపేక్షించొద్దని.. అందుకు బీజేపీ సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. హైడ్రాను పనుల్లో రాజకీయ నాయకులు, వీఐపీలు జోక్యం చేసుకోవద్దని, ఎఫ్టీఎల్ పరిధిలో ప్రభుత్వ భవనాలు ఉన్నా కూల్చివేయాలని చెప్పారు. ప్రభుత్వం కూల్చివేతలపై దృష్టి పెట్టి ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. దవాఖానల్లో మంచాల్లేక.. మందుల్లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు.
అధికారులపైనా చర్యలు తీసుకోండి : ఎంపీ కొండా
ఎఫ్టీఎల్ను కబ్జాలను కూల్చివేయడంతోపాటు, నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమ భవనాలను కొందరు విక్రయించి వెళ్లిపోయారని.. వాటిని కొనుగోలు చేసిన మధ్యతరగతి ప్రజలకు నష్టపరిహారాన్ని ఇప్పించే బాధ్యతను కూడా హైడ్రా తీసుకోవాలని కోరారు. పేదలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.