సిద్దిపేట : రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) పేర్కొన్నారు.ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా జరగని పనిని పూర్తి చేయించి ఇంటి వద్దనే పట్టా అందిస్తున్న ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు.
జిల్లా కేంద్రమైన సిద్దిపేట(Siddipet) క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని చిన్నకోడూర్ మండలం విఠలాపూర్ గ్రామంలో 105, గంగపూర్ గ్రామానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు పట్టా ప్రోసీడింగ్ కాపీలను అందించారు . మాచాపూర్ గ్రామానికి చెందిన నలుగురు భూ రైతులకు మొత్తం 119 మంది అర్హులైన లబ్ధిదారులకు పట్టా ప్రోసీడింగ్ కాపీలను జడ్పీ చైర్మన్ రోజాశర్మతో కలిసి అందజేశారు.
మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రతినీటి బొట్టులో సీఎం కేసీఆర్(CM KCR) కనబడుతున్నారని అన్నారు. వారం, పది రోజుల్లో దాచారం భూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భూ సమస్యలు ఉన్న వారి వద్దకే రెవెన్యూ అధికారులను పంపి పరిష్కారం చేయించినట్లు మంత్రి తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు,రాష్ట్రం వచ్చాక జరిగిన మార్పును ప్రజలు గమనించాలని సూచించారు.
‘మండుటెండలలో విఠలాపూర్ చెరువు మత్తడి దూకూతున్నది. ఇదంతా సీఎం కేసీఆర్ కృషితో సాధ్యమైంద’ ని వెల్లడించారు. త్వరలోనే నియోజకవర్గ పరిధిలోని అన్నీ గ్రామాల్లో భూ రెవెన్యూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్ రెడ్డి, సర్పంచ్ నవీన్, చిన్నకోడూర్ మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.