హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): వచ్చే వానకాలంలో ఎరువుల కొరత రాకుండా ముందస్తు ప్రణాళికతో యూరియా సరఫరాకు చర్యలు చేపడుతున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. రాష్ర్టానికి అవసరమైన యూరియా కేటాయింపు కోసం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖతో సమన్వయంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. నెలకు 10 లక్షల టన్నులుగా ఉన్న యూరియా కేటాయింపులను 11.5 లక్షల టన్నులకు పెంచాలని, రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) నుంచి తెలంగాణకు ప్రత్యేకంగా 2 లక్షల టన్నుల యూరియా కేటాయించాలని కేంద్రమంత్రి జేపీ నడ్డాను కోరినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిపై కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని మంత్రి తుమ్మల చెప్పారు. తెలంగాణకు కేటాయించిన యూరియాను పోర్టుల నుంచి రాష్ర్టానికి వేగంగా తరలించేందుకు కేంద్రప్రభుత్వం పోర్టు అథారిటీని ఆదేశించినట్టు తెలిపారు.
కేంద్రప్రభుత్వం సూచించిన ప్రధాన పోర్టులవద్ద యూరియా రవాణా, లోడింగ్, అన్లోడింగ్, రేక్‌ల కేటాయింపు, నిల్వల తరలింపు పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా రాష్ట్రం తరఫున ప్రత్యేక అధికారులను నియమించాలని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ఆయా అధికారులు ఎరువుల సంస్థలు, రైల్వేశాఖతో సమన్వయం చేసుకుంటూ యూరియా రవాణాలో ఎలాంటి జాప్యం జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రంతో సమన్వయ బాధ్యతలు టీజీ ఆగ్రోస్ ఎండీకి అప్పగించినట్టు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం గంగవరం పోర్టు నుంచి 10 వేల టన్నులు, మహారాష్ట్రలోని జైగఢ్ పోర్టు నుంచి 21 వేల టన్నుల యూరియా రాష్ర్టానికి తరలించినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫెర్టిలైజర్ యాప్‌లో రైతుల సౌలభ్యం కోసం కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు వివరించారు.