హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి అదనంగా 275 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరంలో కొడంగల్ మెడికల్ కాలేజీకి అనుమతి రావడంతో 50 కొత్త సీట్లు అందుబాటులోకి రాగా, ఈఎస్ఐ కాలేజీలో 25, మూడు ప్రైవేటు కాలేజీల్లో 200 సీట్లను పెంచుతూ తాజాగా జాతీయ వైద్యమండలి ఉత్తర్వులను జారీచేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కలిపి ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 9,340కి చేరిందని వైద్య శాఖాధికారులు తెలిపారు. కొడంగల్ కాలేజీతో కలిపి రాష్ట్రంలోని వైద్య కళాశాలల సంఖ్య 65కు చేరింది.
తాజా పెంపుతో రాష్ట్రంలో ఏటా దాదాపు 10 వేల మంది డాక్టర్లు తయారు కానున్నారు. తద్వారా తెలంగాణ డాక్టర్ల కార్ఖానాగా మారిందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి కేసీఆర్ దూరదృష్టి, చిత్తశుద్ధే కారణమని స్పష్టంచేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 2,850 సీట్లే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎంబీబీఎస్ చదవాలంటే విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఆనాడు ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించంతోపాటు తెలంగాణ బిడ్డలు స్వరాష్ట్రంలో ఎంబీబీఎస్ చదువాలనే లక్ష్యంతో కేసీఆర్ సీఎంగా ఉండగా జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏటేటా కొత్త కాలేజీలు ఏర్పాటుచేస్తూ పదేండ్లలో కాలేజీల సంఖ్యను 28కి పెంచారు. దీంతో రాష్ట్రం ఏర్పడినప్పుడు మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,850 ఉంటే.. 2023 నాటికి 8,515కు చేరింది. అంటే దాదాపు రెండున్నర రెట్లు పెరిగాయి. మరోవైపు దవాఖాన పడకలు 2014లో 17,400 ఉండగా 2023 నాటికి ఆ సంఖ్య 34,000కు చేరింది. ఈ ఫలితాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.