న్యూఢిల్లీ, మార్చి 18 : ఎల్పీజీ సిలిండర్ల కొరత తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో.. దేశంలో పలుచోట్ల సిలిండర్ల దొంగతనాలు సర్వసాధారణంగా మారాయి. భోపాల్‌లోని జిల్లా మాజీ జడ్జి విమల్‌కుమార్ జైన్ ఇంటి వద్ద నాలుగు ఖాళీ సిలిండర్లను దొంగలు ఎత్తుకుపోయారు. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఖాళీ ఎల్పీజీ సిలిండర్లను దొంగిలించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.
ఈ ఘటన మార్చి 14న అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరైనా మేల్కొని ఉన్నారా? అని దొంగతనానికి ముందే నిందితులు తనిఖీ చేశారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు ఇంట్లోకి చొరబడి.. నాలుగు సిలిండర్లను ఎత్తుకొచ్చారు. ఇంట్లో పార్కింగ్ ఏరియాలోని నాలుగు సిలిండర్లు లేవన్న సంగతి జడ్జి కుటుంబ సభ్యులు గమనించి, సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు. అందులో కనిపించిన దృశ్యాలు వారిని షాక్‌కు గురిచేశాయి. తమ ఇంట్లో జరిగిన ఘటనపై మాజీ జడ్జి కుమారుడు రాబిన్ జైన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.